ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వద్ద రైతు బజార్
-
పదిరోజుల్లోనే ధరల రెట్టింపు
-
సరకుకు తగ్గటంతోనే డిమాండ్
ఖమ్మం: కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయన్న సామాన్యుల ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన సరుకు దిగుమతి తగ్గడం...జిల్లాలోనూ కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు రెట్టింపయ్యాయి. కూరగాయల (వెజిటబుల్స్) ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యులకు కష్టాలు (ట్రబుల్స్) మొదలయ్యాయి.
కూరగాయ ఉత్పత్తులు తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే మన జిల్లాలో వర్షాలు కురవడంతో రైతులు తొలకరిలోనే కూరగాయ పంటలు సాగు చేశారు. జూన్‌లో సాధారణానికన్నా అధికంగా; జూలై, ఆగస్టులోlసాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. నీటి వనరుల ఆధారంగా సాగు చేసిన కూరగాయలు జూలై, ఆగస్టు నెలల్లో విక్రయానికి వచ్చాయి.
ఆగస్టులో వరుసగా 20 రోజులపాటు వర్షాల జాడ కనిపించకపోవడం... పంట దిగుబడులపై ప్రభావం చూపింది. అయినప్పటికీ మన జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్(ఏపీ) నుంచి పంట ఉత్పత్తులు విరివిగా విక్రయానికి రావడంతో ధరలు బాగా తగ్గాయి. మన జిల్లాలో ఉత్పత్తి పడిపోవడం, ఏపీ నుంచి కూడా దిగుబడులు తగ్గడంతో ఒక్కసారిగా వెజి‘ట్రబుల్స్’ మొదలయ్యాయి.
పది రోజుల్లో రెట్టింపు ధరలు
పది రోజుల కాలంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఆరు నుంచి ఏడు రూపాయలు పలికిన కిలో టమాట ధర ఇప్పుడు రూ.16కు చేరింది. దొండకాయ, నాటు చిక్కుళ్లు, బెండకాయ ధరలు రెట్టింపును దాటాయి. మిగతావాటి రేట్లు కూడా దాదాపుగా ఇలానే ఉన్నాయి.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కూరగాయలు ఆగస్టు 27న ధర సెప్టెంబర్ 7న ధర
కిలో ఒక్కింటికి(రూ.లలో)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
టమాట 07 16
వంకాయ 20 26
బెండకాయ 12 30
కాకర 16 34
బీర 20 28
దొండ 10 32
పొట్లకాయ 16 24
నాటు చిక్కుళ్లు 30 54
ఫ్రెంచ్ బీన్స్ 32 60
–––––––––––––––––––––––––––––––––––––––––––