రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం.. పెరిగిన రవాణా ఖర్చులు
హైదరాబాదీలకు ఇతర రాష్ట్రాల కూరగాయలే ఆధారం
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్.. ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. సాగు నీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.40 వరకు లభించేవి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో రూ.60–80 పలుకుతున్నాయి.
గ్రేటర్‌కు కష్టాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడా దికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నులు వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా చార్జీలు, లోడింగ్, అన్‌లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిపి మోపెడు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమోటా కిలో రూ.15 ఉంటే ప్రస్తుతం రూ.40కి చేరింది. గతంలో పచి్చమిర్చి కిలో రూ.60 ఉండగా ఇప్పుడు రూ.120కి పెరిగింది.
పావు కిలో రూ. 20కి అమ్ముతున్నారు..
వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావుకిలో రూ.15 నుంచి రూ.20 చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా రూ.15 ఉండేది ప్రస్తుతం కిలో రూ.40కి అమ్ముతున్నారు. పచి్చమిర్చి పావు కిలో రూ.20కి దొరికేది. ప్రస్తుతం రూ.40కి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. – అనిత, ఎల్.బి.నగర్.
ధర ఉన్నా ఫలితం లేదు..
ఎకరన్నరలో కూరగాయలు సాగు చేస్తున్నా. వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్‌లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నపుడు ధర ఉండదు. – రైతు, చించల్‌పేట్, నవాబుపేట్ మండలం
రొటేషన్ అయితే చాలు..
ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలు తెస్తున్నాం. రవాణా చార్జీలు, హమాలీ, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి తక్కువ లాభంతో అ మ్ముతున్నాం. ఒక్కోసారి వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పెట్టిన పెట్టుబడి డబ్బులు రొటేషన్ అయితే చాలు అనిపించిన రోజులు ఉంటాయి. మా దగ్గర కిలో రూ.20కి కొనుగోలు చేసి వారపు సంతలో కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు.
– జంగారెడ్డి, హోల్‌సేల్ వ్యాపారి, దిల్‌సుఖ్‌నగర్
ప్రస్తుతం కూరగాయల ధరలు
ఇలా.. కిలో ధర (రూ.లో)
టమాటా 40
ఉల్లి 38
మునగకాడలు 40
క్యారెట్ 50
వంగ 45
బెండ 52
పచి్చమిర్చి 120
Comments
Please login to add a commentAdd a comment