రూ. 200 పెట్టినా.. సగం సంచే..! | Vegetables Price Hike In Telangana | Sakshi
Sakshi News home page

రూ. 200 పెట్టినా.. సగం సంచే..!

Published Fri, Jun 14 2019 10:18 AM | Last Updated on Fri, Jun 14 2019 10:18 AM

Vegetables Price Hike In Telangana - Sakshi

 కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్‌లో ఏ కూరగాయనూ కొనేటట్టు లేదు, తినే టట్టు లేదు. ఆ స్థాయిలో ధరలు మండిపోతున్నాయి. జిల్లాలో గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, వేసవి ఎండల దెబ్బకు కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వీటిని సాగు చేసిన ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ధరలు సామాన్యులను కలవర పెడుతున్నాయి. కిలో కూరగాయలు కొందామని వచ్చిన వినియోగదారులు పావు కిలోతో సరి పుచ్చుకునే పరిస్థితులు ఉన్నాయంటే ధరలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

నల్లగొండ టూటౌన్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయలతో పాటు ఆకు కూరలది అదే పరిస్థితి. ఒక్క ఆలుగడ్డ తప్ప అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో వినియోదారులు లబోదిబోముంటున్నారు.  ల్లాలోని ఆయా ప్రాంతాలలో వేసిన కూరగాయల తోటలు ఎండల దాటికి వట్టి పోవడం, కొన్ని చోట్ల బోర్లు ఎండిపోవడం లాంటి సమస్యలు రైతన్నలను వెంటాడుతున్నాయి. రూ. 20 కూడా పలకని వంకాయలు ప్రస్తుతం 60 రూపాయలకు పెరగడంతో సామాన్యులు, నిత్య కూలీలు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. పదేళ్ల నుంచి జిల్లాలో కూరగాయల సాగు కూడా  గణనీయంగానే పెరిగిపోయింది. పొరుగు  జిల్లాల నుంచి కూరగాయల తెచ్చుకోకుండా రైతులు స్థానికంగా కూరగాయలు పండిస్తున్నా ధరలు మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి.
 
ఆకు కూరలూ అంతే మోత ...
కూరగాయల ధరలు పెరగడంతో ఆకు కూరలు కొందమన్నా ధరల మోత మోగుతోంది. మనకు ఏ రకం ఆకు కూర కావాలన్నా రూ.20 òపెట్టాల్సిందే.  కొత్తిమిర, పాలకూర అసలు నాణ్యమైనది దొరకని పరిస్థితి వచ్చింది. రూ. 10కి ఏడునుంచి 10 పాలకూర కట్టలు రాగా ఇప్పుడు రూ. 20 రూపాయలు పెట్టినా 5 కట్టలే ఇస్తున్నారు.   25 రోజుల నుంచి ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

సాగు పెరిగినా పండని పంట..
జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగానే పెరిగిపోయింది. అయితే పంట మాత్రం రైతుల చేతికి పూర్తి స్థాయిలో రాలేదు. గత ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం, ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఖమ్మం, గుంటూరు, విజయవాడ పట్టణాల నుంచి ఎక్కువగా కూరగాయలు దిగుమతి చేసుకునేవాళ్లు. 10 ఏళ్ల నుంచి ఏటేటా కూరగాయల సాగు జిల్లాలో పెరుగుతూ రావడంతో బయటినుంచి దిగుమతి 90 శాతం తగ్గిపోయింది.   జిల్లాలోని నల్లగొండ, కనగల్, పీఏ పల్లి, త్రిపురారం, అనుముల, పెద్దవూర, కేతేపల్లి, తిప్పర్తి, వేములపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలలో కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు. టమాట, బీరకాయ, దొండకాయ, కాకర, గోకర, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, దోసకాయ, సొరకాయ, ఆకు కూరలు పంటలు వేసినా రైతులకు అక్కరకురాకపోవడంతో ధరలు మిన్నంటాయని చెప్పొచ్చు.

మరో నెల వరకు ఇదే పరిస్థితి ...
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున వర్షాలు పడగానే కూరగాయల సాగు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే రైతులు త మ పొలాల్లో నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు.  మళ్లీ పంట లు వస్తేనే ఈ ధరలు తగ్గే అవకాశం ఉందన వ్యాపారులు చెబుతున్నారు.  ఎండలు పోయినందున ఇక కూరగాయల నిల్వ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉన్నందున వర్షాలు కురిస్తే కొంత మేర ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 

మదనపల్లి నుంచి టమాట, పచ్చి మిర్చి ...

ఇక్కడి ఎండల తాకిడికి టమాట పంట తీవ్రంగా దెబ్బతిన్నది. రైతులు వేసిన పంటలు సరిగా పూతకు రాకపోవడంతో టమాట పంట దిగుబడి పడిపోయింది. పచ్చి మిర్చి కూడా ఇక్కడ సాగు లేదు. దీంతో టమాటను, పచ్చి మిర్చిని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నుంచి దుగుమతి చేసుకుంటున్నారు. ధరలు ఈ రెండింటికి మండుతున్నాయి. టమాట కిలో రూ. 60, పచ్చి మిర్చి కిలో రూ.120కి విక్రయిస్తున్నారు.

ధరలు పెరిగాయి
20 రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ కూరగాయ కొందామన్నా రూ. 50కి తక్కువగా లేదు. కిలో వచ్చే కూరగాయలు ఇప్పుడున్న ధరలకు పావు కిలో మాత్రమే వస్తున్నాయి. తినాలంటే కొనాల్సిందే కదా.. అందుకే రేటు ఎక్కువగా ఉన్నా తప్పదు. – గిరి, వినియోగదారుడు, చర్లపల్లి

ఏం కొనేటట్టు లేదు
మార్కెట్‌లో ఏ కూరగాయ కొనేటట్టు లే దు. బీరకాయ రూ. 120కి విక్రయిస్తున్నా రు. ఈ కాలంలో ధరలు ఇంత ఉండడం ఇదే మొదటి సారి. మార్కెట్‌లో ధరలు చూ స్తే భయ పడాల్సి వస్తుంది. రూ.200 పెట్టి కొనుగోలు చేస్తే రెండు రోజులే వస్తాయి. – ప్రభాకర్,  వినియోగదారుడు,  గుర్రంపూడ్‌

సామాన్యులం కొనలేం
కూరగాయల ధరలు ఇంత ఎక్కువగా పెరిగితే సామాన్యులం కొనలేం. పావు కిలో బీరకాయ, పచ్చి మిర్చి ధరలు రూ.30 ఉంది. ధరలను చూసి కిలో కొనే కాడ అర కిలో కూడా కొనలేకపోతున్నాం. పేద వారు పచ్చడితోనే గడపాల్సి వస్తది. – వనజ, వినియోగదారురాలు, చర్లగౌరారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement