ఆధునిక వైతాళికుడు వేమన
– వేమన సాహితీ సమాలోచన సమితి రాష్ట్ర సదస్సులో వక్తలు
– ఆకట్టకున్న కళారూపాలు
అనంతపురం కల్చరల్ : తెలుగు సాహిత్యానికి వినూత్న రూపమిస్తూ.. మధ్యయుగంలోనే సమాజాన్ని మేల్కోపిన ఆధునిక వైతాళికుడు వేమన అని పలువురు రచయితలు, విద్యావేత్తలు అన్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని పద్మావతి ఫంక‌్షన్ హాల్‌లో ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన రాష్ట్ర సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన రచయితలు, కవుల ప్రసంగాలలో వేమన సాహిత్య ప్రతిధ్వనించింది. వేమన సదస్సుకు ప్రముఖ సాహితీ విమర్శకులు రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షత వహించి పలువురు సాహితీ వేత్తలను సభకు పరిచయం చేశారు.
వేమన సదస్సు ప్రాముఖ్యతను కార్యక్రమ ఆహ్వాన కమిటీ కార్యదర్శి పిళ్లా కుమార స్వామి వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తదితరులతో పాటు ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య గోపి, ఎస్వీ యూనివర్శిటీ మాజీ వీసీ కొలకలూరి ఇనాక్, ప్రఖ్యాత కథా రచయితలు డాక్టర్ శాంతి నారాయణ, సింగమనేని నారాయణ, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేమన సాహిత్యంలోని ప్రత్యేకతను, సంఘ సంస్కరణాభిలాషను వివరించారు.
గురజాడ, శ్రీశ్రీల అభ్యుదయ భావనలకు స్ఫూర్తినిచ్చిన వేమన చిరస్మరణీయుడని, ఆయన సాహిత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత ముందుకెళ్తున్నా ప్రస్తుత రోజుల్లోనూ మధ్యయుగం నాటి రుగ్మతలు మాసిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢాచారాలను ఆనాడే ఖండించిన వేమన ఆలోచనా విధానాన్ని ఈతరం వారు అనుసరించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వేమన సాహిత్య ఆవిష్కరణ
పలువురు రచయితల కలం నుంచి వేమన సాహిత్యంపై జాలువారిన 14 పుస్తకాలను ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. వేమన సాహిత్యంపై ఆచార్య గోపి రచించిన ‘ప్రజాకవి వేమన, ‘వేమన వెలుగులు’, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ‘నిత్య సత్యాలు వేమన పద్యాలు’, కె.ఎల్ కాంతారావు, ఉషారాణి, రాచపాలెం చంద్రశేఖరరెడ్డి సంపాదకీయంలో వచ్చిన వ్యాస సంకలనాలు, గుర్రం వెంకటరెడ్డి పాచన రామిరెడ్డి ‘వేమన–ఇతర భారతీయ కవులు’, ‘వేమన–పునర్మూల్యాంకనం’ తదితర పుస్తకాలను ఆవిష్కరమయ్యాయి. పుస్తకాలను ఉషారాణి, ప్రజాశక్తి లక్ష్మయ్య పరిచయం చేశారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన సదస్సుల్లో వేమన విశిష్ట శైలిపై ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆర్డీటీ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి, జనప్రియ కవి ఏలూరు ఎంగన్న, రచయిత్రి మధు జ్యోతి, కెరె జగదీష్, డాక్టర్ రాధేయ, రాజారామ్ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్, జెట్టీ జైరామ్, సూర్యసాగర్ తదితరులు ప్రసంగించారు.
అలరించిన కళారూపాలు
ప్రజా నాట్య మండలి కళాకారుల ప్రదర్శన అందరిని అమితంగా అలరించింది. ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు బాషా నేతృత్వంలో ఆలోచనాత్మకంగా సాగిన దృశ్య రూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేమన సాహిత్య ప్రచారం ఆకట్టుకుంది. కార్యక్రమంలో సదస్సు జిల్లా నిర్వాహకులు రవిచంద్ర, నానీల నాగేంద్ర, రసూల్, సూర్యనారాయణరెడ్డి, షరీఫ్, కృష్ణవేణి, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.