అందుకే విజయవాడ వచ్చా...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. దీని ద్వారా నేతల కంటే ప్రజలు తెలివైన వారని మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. శనివారం విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ప్యాకేజీపై వస్తున్న విమర్శలు తిప్పికొట్టేందుకే తాను విజయవాడ వచ్చినట్లు వెల్లడించారు. జై ఆంధ్రా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుగార్చిందని విమర్శించారు. 1972లోనే రాష్ట్రం విడిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోయి ఉండేదని వెంకయ్య ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
దేశ సరిహద్దు, కొండ ప్రాంతాల్లోని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారని... అంతేకాని మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకే తాను ఈ సభకు విచ్చేసినట్లు వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రులు మేధావులని... వారు ఎక్కడ ఉన్న రాణిస్తారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజించారని వెంకయ్య ఈ సందర్బంగా ఆరోపించారు. అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుతోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సన్మాన వేదిక వరకు వెంకయ్యనాయుడుతోపాటు బీజేపీ నేతలు ర్యాలీగా వచ్చారు.