సరికొత్త బాటలు | very new roots | Sakshi
Sakshi News home page

సరికొత్త బాటలు

Published Fri, Sep 2 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

సరికొత్త బాటలు

సరికొత్త బాటలు

  • ప్రజా, వాణిజ్య రవాణాకు తిరుగులేని దారులు
  • మారుమూల నుంచి కీలక స్థాయికి ‘గూడెం’ జిల్లా
  • కొత్తగా మరో రెండు జాతీయ రహదారులు
  • కొత్తగూడెం–కొవ్వూరు రైల్వేలైన్‌ వస్తే వేగంగా అభివృద్ధి
  • జలరవాణాతో భద్రాచలానికి డ్రైపోర్టు అవకాశం
  • మణుగూరు : కొత్తగూడెం.. ఇప్పటివరకు సింగరేణి ప్రధాన కేంద్రంగానే సుపరిచితం. జిల్లాల పునర్విభజనతో కొత్తగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా మొత్తానికే కొత్త హంగులు సమకూరనున్నాయి. ఇప్పటికే పారిశ్రామికంగా ముందంజలో ఉన్న కొత్తగూడెం, ఈ జిల్లా పరిధిలోకి వచ్చే మండలాలు మరింత ముందుకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేనివిధంగా కొత్తగూడెం జిల్లాకు వాయు, జల, రోడ్డు, రైల్వే రవాణా వసతులు సమకూరనున్నాయి. 
    –హైదరాబాద్‌ తరువాత వాయురవాణాకు కీలకం
    రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కేంద్రప్రభుత్వం కొత్తగూడేనికి విమానాశ్రయం మంజూరు చేయడం విశేషం. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ లాంటి నగరాలు శంషాబాద్‌ విమానాశ్రయానికి 200 కిలోమీటర్ల లోపు ఉండడంతో జీఎంఎఆర్‌తో ఒప్పందం ప్రకారం వాటికి అనుమతులు ఇవ్వలేదు. 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంకు మాత్రమే షరతులు లేకుండా పౌరవిమానయానశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. సారపాక ఐటీసీ, అశ్వాç³#రం భారజల కర్మాగారం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి, పాల్వంచ కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్‌ ఐరన్, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల, దక్షిణ అయోధ్య భద్రాచలం గుడికి రాకపోకలు సాగించేందుకు వాయుమార్గం ద్వారా మరింత సులువు కానుంది. మారుమూల జిల్లా కాస్తా కీలకంగా మారనుంది. కొత్తగూడెం విమానాశ్రయానికి గోదావరి దగ్గరలో ఉండటంతో ఈ ప్రాంతంలో జలరవాణాతో అనుసంధానం చేసి డ్రైపోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది.
    –గోదావరి నదిపై జలరవాణా మార్గం ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జలరవాణాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుండటంతో ఈ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా బాసర నుంచి భద్రాచలం వరకు సుమారు 750 కి.మీ గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతమంతా బొగ్గునిల్వలు ఉండటం, మారుమూల గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడం, అక్కడ విమానాశ్రయం వస్తుండటంతో జలరవాణాతో అనుసంధానించి డ్రైపోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ జలరవాణా ఆలోచన నేపథ్యంలోనే మణుగూరు–పర్ణశాల మధ్య ప్రతిపాదించిన వంతెనను నావిగేషన్‌కు అనుకూలంగా డిజైన్‌ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది.
    –జలరవాణాతో చౌకగా ఏటా 100 మిలియన్‌ టన్నుల రవాణా
    జలరవాణా అందుబాటులోకి వస్తే గోదావరి ద్వారా సంవత్సరానికి సుమారు 100 మిలియన్‌ టన్నుల సరుకును చౌకగా రవాణా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు రవాణాతో పోలిస్తే జలరవాణా చౌకగా ఉంటుందని.. దీన్ని ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వం యత్నిస్తోంది. రాష్ట్రంలో గోదావరి పొడవునా శ్రీరాంసాగర్‌ దిగువన ‘సోన్‌’ నుంచి భద్రాచలం వరకు 30 వరకు చిన్న చిన్న బ్యారేజీలు ‘స్టెప్‌లేడర్‌ టెక్నాలజీ’ ద్వారా నిర్మిస్తే రాష్ట్రంలో నది పొడవునా ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉంటాయని రిటైర్డ్‌ ఇంజినీర్‌ టి.హనుమంతరావు ప్రత్యేక ప్లాన్‌ రూపొందించారు. ఈ విధానం అమలు చేసి బ్యారేజీలు నిర్మిస్తే 450 టీఎంసీల నీటిని వినియోగించుకుని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, 300 టీఎంసీల లైవ్‌ స్టోరేజీకి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని నివేదికలో తెలిపారు. బ్యారేజీల నుంచి నావిగేషన్‌ కెనాల్స్‌ నిర్మించుకుంటే సులువైన రవాణాకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే దుమ్ముగూడెం వద్ద 170 ఏళ్ల కిందట కాటన్‌ దొర నిర్మించిన నావిగేషన్‌ కెనాల్‌ ఉంది. ఆ రోజుల్లోనే గోదావరి ద్వారా జలరవాణా చేయడం విశేషం.
    –జిల్లాలో డ్రైపోర్టులకు అవకాశం
    తెలంగాణలో సముద్రం తీరం లేనందున రాష్ట్రంలో తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొత్తగూడెం జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేసుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బంకింగ్‌హామ్‌ కాలువను అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. చైన్నై వరకు జలరవాణాకు అవకాశం ఉంటుంది. దీనివల్ల బొగ్గు, ఐటీసీ పేపర్, అటవీ ఉత్పత్తులు, ముగిసరుకులు తేలికగా రవాణా చేయవచ్చు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, సారపాక ప్రాంతాల్లో సింగరేణి, కేటీపీఎస్, భారజల ప్లాంట్, నవభారత్, స్పాంజ్‌ఐరన్, భద్రాద్రి మినరల్స్, ఐటీసీతో పాటు మణుగూరులో కొత్తగా భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మిస్తుండటంతో పాటు కొత్తగూడెంలో విమానాశ్రయం రానుండటంతో మరిన్ని ఉపయోగాలు కలుగుతాయి. 
    –రైలు రవాణా మరింత పెరిగే అవకాశం
    కొత్తగూడెంతో పాటు మణుగూరు వరకు రైల్వే లైను ఉండడంతో ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు ప్రజారవాణాతో పాటు సింగరేణి బొగ్గు రవాణా అవుతోంది. ఒక్క మణుగూరు నుంచే బొగ్గు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు సంవత్సరానికి రూ.100కోట్ల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో రైల్వే సేవలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వాయురవాణా, జలరవాణా అందుబాటులోకి వస్తే గూడ్స్‌ రవాణా కోసం అనేక ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న కొత్తగూడెం–కొవ్వూరు, మణుగూరు–రామగుండం, పాండురంగాపురం–సారపాక రైల్వే లైన్లు సాకారం అయ్యే అవకాశం ఉంది.
    –పెరగనున్న జాతీయ రహదారులు
    కొత్తగూడెం జిల్లాలో జాతీయ రహదారులు మరింత విస్తరించనున్నాయి. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట, ఖమ్మం మీదుగా భద్రాచలం వరకు ఉన్న 320 కి.మీ జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ను కలుపనుంది. దీనికి అనుసంధానంగా హైదరాబాద్‌ నుంచి మరో కొత్త జిల్లా మహబూబాబాద్, ఇల్లెందు మీదుగా కొత్తగూడెం వరకు 264 కి.మీ రహదారికి అవకాశం ఏర్పడింది. ఇక వరంగల్, హన్మకొండ మీదుగా భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మీదుగా జిల్లాలోని వాజేడు ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు రహదారి కలుపనుంది. ఇక కొత్తగా బూర్గంపాడు మండలం సారపాక నుంచి ఏటూరునాగారం వరకు 107 కి.మీ జాతీయ రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో పాటు సర్వే కూడా ప్రారంభించింది.
    –ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
    ఇప్పటికే మరిన్ని జాతీయ రహదారులు, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో కొత్త ఊపు వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటు అవుతుండటంతో జలరవాణా అందుబాటులోకి వస్తే అనేక కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. కొత్తగూడెం–కొవ్వూరు రైల్వేలైన్, మణుగూరు–రామగుండం రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తే జిల్లా మరింత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
    –పర్యాటకానికి కొత్త వెలుగులు
    విమానాశ్రయంతో పాటు గోదావరిపై జలరవాణా ప్రారంభమైతే రాష్ట్రంలో పర్యాటకం మరింత ఊపందుకుంటుంది. భద్రాచలం పుణ్యక్షేత్రంతో పాటు గోదావరి సమీపంలోని పర్ణశాల, వరంగల్‌ జిల్లా మల్లూరు, మేడారం, కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం, ధర్మపురి, ఆదిలాబాద్‌ జిల్లా బాసరతో పాటు పారిశ్రామిక, అటవీ టూరిజం అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement