న్యూయార్క్ : అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న వర్ణ వివక్షపై అలెక్స్ హేలీ అనే రచయిత 'రూట్స్' అనే నవల రాశారు. ఆ నవలలో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించడాన్ని రచయిత వివరించారు. ఆ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేసే తీరు.. అమెరికాకు తీసుకొచ్చాక వారిపై సాగించే దురాగతాలను కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ అమెరికాలో ఎక్కడో ఒక చోట వర్ణ వివక్ష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో మాత్రం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది.
ఆఫ్రో అమెరికన్ రాబర్ట్ నోయెస్ (52) తనకు పరిచయం ఉన్న ఒక తెల్లజాతి మహిళను కిడ్నాప్ చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లిన రాబర్ట్.. విచిత్రమైన శిక్షను అమలు చేశాడు. అదేంటంటే.. ఏకధాటిగా 9 గంటలు 'రూట్స్' మినీ వెబ్ సిరీస్‌ను చూడాలని బలవంతం చేశాడు. అయితే సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను పట్టుకొని టీవీ ముందు నుంచి కదిలావంటే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తానని బెదిరించాడు. వర్ణ వివక్ష అనేది ఎంతలా ఉందనేది ఆమెకు అర్థమయ్యేందుకే రాబర్ట్ 'రూట్స్' సిరీస్ చూపించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాగా రాబర్ట్ నోయెస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ద 'రూట్స్' నవల 1977లో టీవీ సిరీస్‌గానూ రూపుదిద్దుకొంది. తన మూలాలను వెతుక్కుంటూ ఏడు తరాల బానిస గోసను హేలీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన రూట్స్ నవలను ఏడు తరాల ప్రస్థానంగా అభివర్ణించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment