తిరుపతి నుంచి అమరావతికి బయలుదేరి వెళ్తున్న వెటర్నరీ విద్యార్థులు
అగమ్య గోచరం
Published Fri, Aug 26 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
సాక్షి, చిత్తూరు:రాష్ట్రంలో పశువైద్య నియామకాలు అగమ్యగోచరంగా మారాయి. పబ్లిక్,ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ ద్వార పశువైద్యశాఖలోని ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని వెటర్నరీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల జీతం, హోదా తగ్గుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా వెటర్నరీ చదువుకున్న విద్యార్థులెవరైనా మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభిస్తుందని.. ఫలితంగా స్థానికులకు ఉద్యోగాల కొరత ఏర్పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, గుజరాత్‌లలో పశువైద్య నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పీపీపీ విధానం వల్ల రాష్ట్రేతరులు బాగుపడతారని స్థానికులు నష్టపోతారని విద్యార్థిసంఘాలు అంటున్నాయి. విద్యార్థుల నుంచి ఆందోళనలు చెలరేగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గన్నవరం, చిత్తూరు ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీని కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
జోనల్ సిస్టమ్ వల్ల భర్తీ సమస్య...
ప్రస్తుతం జోనల్ సిస్టమ్ వల్ల కూడా పోస్టుల భర్తీ ఆలస్యం అవుతోంది. పశువైద్య పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాకపట్నంలు ఒక జోన్‌గా, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా రెండో జోన్‌గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మూడో జోన్‌గా, రాయలసీమ జిల్లాలు నాలుగో జోన్‌గా విభజించారు. ఆయా జోన్లలోని ఖాళీలను అక్కడే భర్తీ చేయాల్సి ఉంటుంది. మొన్న జరిగిన బ్యాక్‌లాగ్ భర్తీలో కూడా ఈ జోనల్ సిస్టమ్ వల్ల కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి. గుంటూరులో ఎస్సీ పశువైద్య అభ్యర్థులు ఆ పోస్టులు అలాగే మిగిలిపోయాయి. జోనల్ సిస్టమ్ ఎత్తేసి రాష్ట్రాన్ని ఒకే జోన్‌గా ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరతున్నారు.
జీవో నెం 474 ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి..
జీవో నెం 474 ప్రకారం పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంసెట్ లాంటి అ«ధిక పోటీ ఉన్న పరీక్షలో ఉత్తమర్యాంకులు సాధించి సీటు సాధించుకున్నామని.. పాఠ్యాంశాలు కూడా అంత సులభంగా ఉండవని.. ఇన్ని దాటుకొని మళ్లీ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకోవాలంటే కష్టంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. ఒక వేళ పరీక్షకు ఒప్పుకున్నా ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియామకాలకు ఒక రోస్టర్ విధానమంటూ లేని ఏపీపీఎస్సీపై నమ్మకం లేదని విద్యార్థులు చెబుతున్నారు. జీవో నెం 474 ప్రకారం అయితే అకడమిక్‌లో మంచి ర్యాంక్‌లు ఉన్నవారికి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవో ప్రకారం పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ అవసరం లేదు.
నేడు విజయవాడ వెటర్నరీ డైరెక్టరేట్ ముట్టడి..
ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరంలోని పశువైద్యకళాశాల విద్యార్థులు విజయవాడ లబ్బీపేటలోని వెటర్నరీ డైరెక్టరేట్‌ను శుక్రవారం ముట్టడించాలని నిర్ణయించారు. దీనికి సుమారు 350 మంది విద్యార్థులు రానున్నారు.
Advertisement
Advertisement