
చీకట్లు నింపిన వెలుగు
వెలుగులు పంచాల్సిన కరెం తీగ యమపాశమైంది.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది.. జీవనాధారమూ లేకుండా చేసింది.. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన ఐదేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు.
- రొద్దం (పెనుకొండ)
రొద్దం మండలం తురకలాపట్నంలో గురువారం సంభవించిన విద్యుదాఘాతానికి మాల సుశీలమ్మ(50) అనే మహిళా రైతు మరణించారు. ఆమెతో పాటు రెండు గొర్రెలూ మృత్యువాతపడ్డాయి. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు...
ఎలా జరిగిందంటే...
సుశీలమ్మ మేత కోసం గొర్రెలను తోలుకొని వ్యవసాయ తోట వద్దకు వెళ్లారు. విద్యుత్ స్తంభం నుంచి స్టార్టర్‌కు అనుసంధానించిన సర్వీస్ వైరు అక్కడి బోరు బావి వద్ద గల స్టార్టర్ బాక్సుపై పడకుండా ఓ ఇనుప కడ్డీతో కొబ్బరి చెట్టుకు కట్టి ఉంచారు. ఈ క్రమంలో గొర్రెలు అటు వైపు వెళ్తూ ఇనుప కడ్డీని తాకాయి. దీంతో విద్యుత్ షాక్ గురయ్యాయి. వాటిని కాపాడేందుకు ప్రయత్నించిన సుశీలమ్మ సైతం కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందారు.
మృత్యుంజయుడు భరత్
సుశీలమ్మకు తోడుగా వెళ్లిన మనవడు భరత్(5) అప్పటి మేరకు గొర్రెలతో ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విద్యుదాఘాతం సంభవించి అవ్వ సహా గొర్రెలు నిర్జీవంగా పడిపోవడంతో భయపడిన భరత్ అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు. ఒంటరిగానే గ్రామంలోకి వెళ్లి అవ్వతో పాటు గొర్రెలు కదలకుండా పడిపోయారంటూ చెప్పడంతో అతని తల్లిదండ్రులు అనిత, హరీశ్ సహా గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. వారొచ్చేలోపే సుశీలమ్మ సహా గొర్రెలు మృతి చెందాయి. భయంతో పరుగులు తీసి భరత్ ప్రాణాలు దక్కించుకోవడంతో మృత్యుంజయుడిగా గ్రామస్తులు అతన్ని అభివర్ణించారు.
రెండేళ్లలోనే అమ్మానాన్నను కోల్పోయి..
సుశీలమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల కిందట సుశీలమ్మ భర్త అనారోగ్యంతో చనిపోయారు. కుమారులు హరీశ్, దేవరాజ్ కుటుంబాలతో కలసి ఉంటున్న సుశీలమ్మే ఇంటి వ్యవహారాలన్నీ చూస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఇంటికి ఆమె పెద్ద దిక్కు. అటువంటిది ఇప్పుడు విద్యుదాఘాతానికి గురై ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇక తాము ఎవరి కోసం బతకాలంటూ గుండెలు పగిలేలా రోదించారు. కాగా విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్ నరసింహులు, ట్రాన్స్‌కో ఏఈ హరినాథ్ తమ సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.