
సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత సృష్టి
అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి భారతీయ చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు విజయ్ కుమార్ చేనేత మగ్గంపై పట్టు దారాలతో కుట్టు లేని ప్యాంటు షర్టును తయారు చేశారు.
► చేనేత మగ్గంపై పట్టుదారంతో..
► కుట్టులేని ప్యాంటు, షర్ట్
► నల్ల పరంధాములు తనయుడి ప్రతిభ
► గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన పరంధాములు
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి భారతీయ చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు విజయ్ కుమార్ చేనేత మగ్గంపై పట్టు దారాలతో కుట్టు లేని ప్యాంటు షర్టును తయారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ 45 రోజులపాటు చేనేత మగ్గంపై పట్టు పోగులతో ప్యాంటు, షర్ట్ తయారు చేశారు. తన తండ్రి నల్ల పరంధాములు చేనేత కళా వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న విజయ్‌కుమార్.. కేవలం 120 గ్రాముల బరువుతో ప్యాంటు, షర్ట్‌ను నేసి ఔరా అనిపించారు.
గతంలోనూ..
నల్ల విజయ్‌కుమార్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు తయారు చేశారు. అరటి నారలతో చేనేత మగ్గంపై శాలువా రూపొందించారు. చేనేత మగ్గంపై జాతీయ పతకాన్ని కుట్టులేకుండా నేశారు. బం గారం తీగలతో బ్రాస్‌లెట్ తయారు చేసి అబ్బురపరిచారు. 2012 నుంచి నల్ల విజయ్‌కుమార్ చేనేత మగ్గంతో ప్రయో గాలు చేస్తున్నారు.
ఆ అద్భుతాలకు గుర్తింపుగా తెలంగాణ రికార్డుల బుక్‌లో చోటు సంపాదించారు. విజయ్‌కుమార్ తండ్రి నల్ల పరంధాములు 1990లో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కుట్టులేని జాకెట్ తయారు చేశారు. ఆయన మగ్గంపై కుట్టులేకుండా నేసిన భారతీయ త్రివర్ణ పతాకం ప్రపంచ క్రీడావేదిక అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ క్రీడోత్సవాల్లో ప్రదర్శించారు. పరంధాములు 2012 ఆగస్ట్ 13న మరణించారు. తండ్రి అడుగు జాడల్లోనే నల్ల విజయ్‌కుమార్ చేనేతమగ్గంపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు.
సీఎంను కలవాలని ఉంది : నల్ల విజయ్‌కుమార్
అంతరించి పోతున్న చేనేత కళావైభవాన్ని భావితరాలకు చాటి చెప్పేందుకే నేను ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నానని నల్ల విజయ్‌కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలసి చేనేత మగ్గంపై తయారు చేసిన వస్త్రాలను ఆయనకు అందిస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్ ద్వారా సీఎంను కలుస్తానని పేర్కొన్నారు.