మా బతుకులను రోడ్డున పడేశారు
అనంతపురం అర్బన్: విజయనగర్ కాలనీ ఆర్డీటీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసి తమ బతుకులను రోడ్డు పాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు స్థలంలో అనధికారికంగా నిర్మించుకున్న ఇళ్లను ఇటీవల రెవెన్యూ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. దీంతో బాధితులు తమ కష్టాన్ని కలెక్టర్‌కు చెప్పుకునేందుకు డివిజన్ కార్పొరేటర్ ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఖాళీ స్థలంలో ఇళ్లు వేసుకుంటే పట్టాలిప్పిస్తానని జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హామీ ఇచ్చారన్నారు.
దీంతో పేదలు ఆర్డీటీ కార్యాలయం వెనుక ఉన్న స్థలంలో లక్షల రూపాయలు అప్పు చేసి ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పేదలు వేసుకున్న ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను తొలగించిన అధికారులకు ప్రభుత్వ స్థలంలో పెద్దలు నిర్మించుకున్న ఇళ్లు కనిపించలేదా..? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు తొలగించడం లేదన్నారు. రాజకీయ కక్షతోనే పేదల ఇళ్లను కూల్చి నిరాశ్రయులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అరుణ, శివమ్మ, ఉమాదేవి, రామకృష్ణ, పర్వీన్, లక్ష్మీదేవి, అనిత, తదితరులు ఉన్నారు.