అక్రమాలపై చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో భారీ అవినీతి చోటు చేసుకుందని, గ్రామ పొలాల్లో రాళ్ల గుట్టలకు 56 మంది అడంగల్, 1–బిలో పేర్లు నమోదు చేసుకుని, వాటితో కోట్ల రూపాయల్లో పంట రుణాలు తీసుకున్నారని కలెక్టర్ జి.వీరపాండియన్‌కి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శుక్రవారం కలిసి ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. 14 సర్వేనెంబరులో 25.12 ఎకరాలు రాళ్ల గుట్ట ఉందన్నారు.
దీనికి సబ్‌లెటర్లు సృష్టించి ఒక్కొక్కరికీ 5 ఎకరాల చొప్పున 33 మందికి పట్టాలు ఇచ్చారన్నారు. అలాగే 261,407, 406, 51 సర్వేనెంబర్లకు లెటర్లు సృష్టించి పట్టాలు చేసుకున్నారన్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలకు దొంగపట్టాలు పొంది వాటితో కెనరా బ్యాంక్‌లో రూ.కోట్ల పంట రుణాలు పొందారన్నారు. వీటిని అడ్డంపెట్టుకుని ఇన్‌పుట్ సబ్సిడీని కూడా స్వాహా చేశారన్నారు. దీంతో నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గొందిరెడ్డిపల్లితో పాటు మండలంలోనూ చాలా మంది దొంగ పాసుపుస్తకాలు పొందారన్నారు.
ప్రభుత్వ భూములు, శ్మశానాలను ఆక్రమించి బ్యాంకులో తాకట్టుపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేసి తక్షణం రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చెన్నారెడ్డి, ఎంపీటీసీలు గోవిందరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ రూరల్ కన్వీనర్ నాగేశ్వరెడ్డి, రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, నాయకులు ఎర్రగుట్ల కేశవరెడ్డి, హంపాపురం సింగారెడ్డి, బీసీ సెల్ నాయకుడు లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.