విజయపురి వెలవెల
విజయపురి వెలవెల
Published Fri, Aug 12 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
విజయపురిసౌత్ : కృష్ణా పుష్కరాలకు విజయపురిసౌత్‌లోని ప్రధాన పుష్కరఘాటైన కృష్ణవేణి పుష్కర ఘాట్‌కు ప్రతిరోజు 40 నుంచి 50 వేల మంది వస్తారని అధికారులు అంచనావేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక కోసం అటెన్షన్‌లో ఉన్నారు. ప్రారంభంలో 200 మందికి మించి భక్తులు రాలేదు. తరువాత వస్తారని ఎదురుచూసినా గంటగంటకు భక్తులు నామమాత్రంగానే వచ్చారు. వందల సంఖ్యకే పరిమితమై సాయంత్రం 4 గంటల వరకు 1,000 మందికి మించి భక్తులు రాకపోవడంతో అంచనాలు తారుమారు కావడంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. భక్తుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారిగేట్లను తాత్కాలికంగా తొలగించారు. ఉదయం నుంచి భక్తుల ఒత్తిడి లేకపోవడంతో అధికారులు కూడా వచ్చిన భక్తులకు ఎదో ఒక సూచనలు అందిస్తూ కాలం గడిపారు. విజయపురిసౌత్‌లో కీలకమైన కృష్ణవేణి పుష్కరఘాట్‌కు రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఎం చంద్రబాబు సందర్శించే అవకాశం ఉందని స్పెషల్ ఆఫీసర్ బాలాజీనాయక్ తెలిపారు. భక్తుల రాక తక్కువుగా ఉండటంతో లాంచీస్టేషన్ ప్రధాన రహదారి వెలవెలబోయింది.
Advertisement