పల్లె పిలుపుతో గ్రామీణాభివృద్ధి
పల్లె పిలుపుతో గ్రామీణాభివృద్ధి
Published Tue, May 9 2017 11:30 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెండు టీమ్‌ల ఏర్పాటు
– ప్రతి వారం రెండు గ్రామాలకు వెళ్లి అధ్యయనం
– మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో పర్యటన
– వర్క్‌షాప్‌లో కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పల్లె పిలుపు కార్యక్రమం చేపట్టాలని.. అన్ని శాఖల అధికారులు జవాబుదారీ తనంతో గ్రామీణ ప్రగతికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పల్లె పిలుపు కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈలు తదితరులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి ప్రారంభించనున్న పల్లె పిలుపు కార్యక్రమంపై కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ పరిపాలన పటిష్టమైతే ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే చాలా వరకు పరిష్కారమవుతాయన్నారు. గ్రామ స్థాయి పరిపాలనను మెరుగు పరిచేందుకు తహసీల్దార్, ఎంపీడీఓల ఆధ్వర్యంలో రెండు టీమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రతి వారం ఈ టీమ్‌లు రెండు గ్రామాలను విధిగా కవర్ చేయాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లే ఈ టీమ్‌లు గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు, చౌక దుకాణాలు తదితరాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించాలన్నారు. ఇలా మూడు నెలలకు మండలంలోని అన్ని గ్రామాలను కవర్ చేయాలని ఆదేశించారు.
పిల్లె పిలుపు కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఏడాది 400 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి హైస్కూల్‌కు ప్లే గ్రౌండ్ ఉండాలని, లేని పాఠశాలలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో ప్లే గ్రౌండ్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. సమస్య ఎక్కువగా ఉంటే తక్షణం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, అన్ని మండలాల నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement