మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు
మచిలీపట్నం: బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణకు గ్రామస్తులను ఒప్పిస్తామంటూ వెళ్లిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణలను గ్రామస్తులు తరిమికొట్టారు. పచ్చటి పంట పొలాలను కూడా భూసేకరణ జాబితాలోకి చేర్చి.. పొలాలు ఇవ్వడానికి రైతులను ఒప్పిస్తామని మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణ సర్వే సిబ్బందితో కలిసి శనివారం బందరు మండలంలోని కోన గ్రామానికి వెళ్లారు.
అయితే, రెండు మూడు పంటలు పండే పచ్చటి పొలాలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి, ఎంపీ కలిసి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, అసలు మీరు మా గ్రామానికి వచ్చే సాహసం ఎలా చేశారంటూ రైతులు, గ్రామస్తులు వాళ్ల మీద తిరగబడ్డారు. వాళ్లను మాట్లాడనివ్వకుండా గ్రామంలోంచి తక్షణం వెళ్లిపోవాలంటూ తిరగబడ్డారు. అలా గ్రామ పొలిమేరల వరకు నేతలను రైతులు తరిమికొట్టారు. ఈ సమయంలో మంత్రి రవీంద్ర పీఏ హరిబాబు రైతులను నివారించే ప్రయత్నం చేయడంతో.. వాళ్లు ఆయనపై తిరగబడ్డారు. ఈ ఘటనలో హరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు మంత్రి, ఎంపీ గ్రామస్తుల ఆగ్రహానికి తలవంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.