నడిరోడ్డుపై మంత్రి ఘెరావ్
♦ రోడ్లు పరిశీలించాలని కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు
♦ కారుదిగకుండా వెళ్లిపోయిన మంత్రి తీరుపై నిరసన
పెంటపాడు :
తమ సమస్యలు వినేందుకు కారు దిగని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీరుకు బుధవారం కొండేపాడులో గ్రామస్తులు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం మంత్రి కాన్వాయ్ బి.కొండేపాడు రాగా గ్రామంలోని ఎస్సీ, బీసీ పేటలకు చెందిన సుమారు 50 మంది అడ్డుకున్నారు. తమ గ్రామంలో వేసిన సీసీ రోడ్లునే రూ.20 లక్షలతో మళ్లీ వేస్తున్నారని, ఎంతో కాలంగా అధ్వానంగా ఉన్న ఎస్సీ, బీసీ పేటలలోని కొన్ని అంతర్గత రహదారులను పట్టించుకోవడం లేదని మంత్రికి వివరించారు.
కారు దిగి ఆ రోడ్లును పరిశీలించాల్సిందిగా కోరారు. కాగా మంత్రి మళ్లీ వస్తానని కారుదిగకుండా వెళ్లిపోయారు. దీంతో ఆయన తీరుకు నిరసనగా ప్రజలు రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు పాలా గణపతి, పబ్బా రామారావు, ఎస్సీ నాయకులు కొడమంచిలి జాన్ తదితరులు మాట్లాడుతూ సుమారు 8 చిన్న అంతర్గత రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి మళ్లీ నిరసనకారుల వద్దకు వచ్చి వినతి స్వీకరించారు. కానీ రోడ్లు పరిశీలించాలన్న కోరికను మన్నించకుండానే కారులో వెళ్లిపోయారని గ్రామస్తులు చెప్పారు. ఆందోళనలో అంబటి శ్రీను, దేవరశెట్టి రాంబాబు, పబ్బా పార్వతి, బిట్రా పాపాలు, పాలా పద్మావతి, పి.లక్ష్మి, పి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.