పంచమి నుంచి చవితి వరకు..
వినాయక చవితి...సంవత్సరానికి ఒక్కసారే వచ్చే పండుగైనా సంవత్సరమంతా గుర్తుండేలా ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని వినాయక చౌక్‌లో ప్రతిష్టించే గణపతికి విశేష ప్రాముఖ్యం ఉంది. అందుకే ఇక్కడే చేసే ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నెల 12న పంచమి రోజున భూమిపూజతో ప్రారంభమైన పనులు 25వ తేదీ చవితి నాటికి పూర్తయ్యాయి.
ఆగస్టు 12 : చవితి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతపురం నగర మేయర్ స్వరూప, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పరిచూరి రమేష్ ఆధ్వర్యంలో వినాయక చౌక్‌లో వేదపండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి ప్రతీకగా కాషాయ జెండాను ఎగురవేశారు.
ఆగస్టు 17 : వినాయకచౌక్‌లో వేసే గణేష్ మంటపం నమూనా ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఈసారి రాజస్థాన్ నుంచి విచ్చేసిన కళాకారులు తమ నైపుణ్యంతో మంటపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే 17వ తేదీ నాటికి మంటపం ముఖ ద్వారం పనులు ప్రారంభించారు.
ఆగస్టు 19 : గణేష్ మంటపం కేఎస్‌ఆర్ బాలికల జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉంటుంది. ముఖద్వారం నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఉండే మంటపంపై రేకులు వేయడంతో పాటు ముఖద్వారానికి ఓరూపు తీసుకువచ్చారు.
ఆగస్టు 22 : రాజస్థాన్‌లోని రణతంబోర్‌లోని ఆలయ నమూనాతో మంటపాన్ని ప్రారంభించిన కళాకారులు 22వ తేదీ నాటికి ముఖద్వారాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మంటపం ఎదురుగా రెండు ఏనుగులు ఘీకారం చేస్తున్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. చుట్టప్రక్కల పరదాలను ఏర్పాటు కూడా పూర్తి చేశారు.
ఆగస్టు 23 : మంటపం ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. 23వ తేదీ బుధవారం నాటికి మంటపం పనులు పూర్యయ్యాయి. మంటపం లోపల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అవసరమైన నమూనా కూడా పూర్తి చేశారు. మంటపం బయట, లోపల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఆగస్టు 24 : పనులన్నీ పూర్తికాగా...విద్యుత్‌దీపాల వెలుగులో వినాయక చౌక్ కాంతులీనింది. సప్తగిరి సర్కిల్ నుంచి మంటపం వరకు విద్యుత్ దీపాలతో స్వాగత తోరణాలు...అమ్మవారి రూపాలను రూపొందించారు. మంటపం లోపల ‘గంగా–పార్వతీ సంవాదం’ పేరిట కదిలే విగ్రహాలను సిద్ధం చేశారు.
ఆగస్టు 25 : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మంటపంలో రణతంబోర్ ఆలయంలోని విగ్రహాన్ని పోలిన రీతిలోనే తయారు చేసిన స్వామివారి విగ్రహాన్ని తెల్లవారుజామున ప్రతిష్టించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించి..దర్శనానికి ఏర్పాట్లు చేశారు.