భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త
భార్యను శీల పరీక్షకు నిలిపిన భర్త
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జంగాల కాలనీకి చెందిన పస్తం బాలకృష్ణ తన భార్య తిరుమలమ్మను శీల పరీక్షకు నిలిపాడు. ఇటీవల ఆమె బండిపాలెం గ్రామానికి చెందిన నరసింహారావుకు చెందిన కిరాయి ఆటో ఎక్కింది. ఆ సమయంలో అతడు తిరుమలమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని ఆమె భర్తకు చెప్పగా అతను అనుమానంతో ఆమెకు శీల పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు. కుల పెద్దలకు సమాచారమిచ్చి వారిని గురువారం తెల్లవారుజామున చిల్లకల్లు-మక్కపేట రహదారి ఎన్‌ఎస్పీ కాల్వగట్టు వద్దకు రావాలని కోరాడు.
వారు వచ్చేసరికి గట్టుపై కట్టెల పొయ్యి వెలిగించి ఆకురాయిని ఎర్రగా కాల్చాడు. ముందుగా భార్య శరీరానికి పసుపు పూసి కుంకుమ పెట్టాడు. ఆ తర్వాత కాలిన ఆకురాయిని నిప్పుల్లో నుంచి తీసి చేత్తో పట్టుకుని శీలపరీక్షలో నెగ్గాలని తిరుమలమ్మకు సూచించాడు. ఈ విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్.ఐ. షణ్ముఖసాయి, సిబ్బందితో వెళ్లి సంఘటనను అడ్డుకున్నారు. కుల పెద్దలు, భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
- చిల్లకల్లు (జగ్గయ్యపేట)