- - కళా వెంకట్రావు
విశాఖ మహానాడును జయప్రదం చేయండి
Published Tue, May 23 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
ప్రత్తిపాడు/ఏలేశ్వరం :
విశాఖలో ఈ నెల 27,28,29 తేదీల్లో జరగనున్న మహనాడును విజయవంతం చేయాలని పార్టీ పరిశీలకుడుమ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కోరారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ పామాయిల్ తోటలో మంగళవారం జరిగిన మినీ మహనాడు సభలో ఆయన ప్రసంగించారు. మహనాడులో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 17 అంశాలు, తెలంగాణాకు సంబంధించి ఏడు, మరో ఐదు ఇతర అంశాలను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాటు పడుతున్నారన్నారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిందని చెప్పారు. కోటిపల్లి – నర్సాపురం, పిఠాపురం – కాకినాడ రైల్వేలైన్లు పూర్తి చేస్తామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కాకినాడు–కోటిపల్లి–నర్సాపురం, పిఠాపురం–కాకినాడ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 630 కోట్లు రైల్వేశాఖ కేటాయించిందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో పార్టీలో విభేదాలు లేవన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు వస్తున్నాయన్నారు. ఈ సభలో సాగు నీటి ప్రాజెక్టులు – వాటి పరిస్థితులు, పార్టీ అభివృద్ది, విధి విధానాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, రాష్ట్రాభివృద్ధి, బీసీ సంక్షేమం తదితర అంశాలపై జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు, వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి మూలారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఆప్‌కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త పర్వత రాజబాబుతోపాటు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పదవులు పొందిన చిక్కాల రామచంద్రారావు, గన్ని కృష్ణ, సత్యనారాయణరాజులను మంత్రి యనమల శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమానికి తొలుత పార్టీ పతాకాన్ని ఎంపీ తోట ఆవిష్కరించగా, పార్టీ నాయకుల మృతికి సమావేశం మౌనం పాటించింది.
Advertisement
Advertisement