kala venkatarao
-
కళా, కలిశెట్టిలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనుకున్నదంతా అయ్యింది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపినా.. మంగళగిరిలో కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా ఎచ్చెర్ల టీడీపీ ఆశావహులకు నిరాశ తప్పలేదు. తూర్పుకాపులు అత్యధికంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నడికుదుడి ఈశ్వరరావును బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా ప్రకటించా రు. ఐదేళ్లుగా అక్కడ టీడీపీని నిలబెట్టుకుంటూ వస్తున్న కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడులకు వెన్నుపోటు పొడిచి సీటును బీజేపీకి కట్టబెట్టేశారు. వీరిద్దరి తగువు తీర్చలేక బీజేపీకి కేటాయించి తమ సామాజిక వర్గ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించేలా చంద్రబాబే పావులు కదిపారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. గత 58 నెలలుగా పార్టీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. గత ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. ఇదిగో టికెట్ అని చెప్పి ఇద్దర్నీ ఊరించారు. ఆఖరి వరకు వారి సేవలను వాడుకున్నారు. టికెట్ ఖరారు చేసే సమ యానికి యూజ్ అండ్ త్రో మాదిరిగా వదిలేశారు. చంద్రబాబు నిర్వాకం చూసి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుని మమ్మల్ని బలి పశువు చేశారని ఆ పార్టీ నాయకులే దుమ్మెత్తి పోస్తున్నారు. డిపాజిట్లు రాని వ్యక్తికి టికెట్ ఇస్తే ఏం ప్రయోజనమని దుయ్యబడుతున్నారు. ఇక్కడ బీజేపీకి అంత సీన్ ఉందా.. అందులో ఎన్‌ఈఆర్‌కు కనీస ప్రజాదరణ ఉందా.. ఏమీ లేని వాడికి టికెట్ ఇస్తే మేం పనిచేయాలా?అలాంటి వ్యక్తికి తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. ఓడిస్తామని టీడీపీ శ్రేణులు శపథం పూనుతున్నాయి. ఇప్పటికే ఎన్‌ఈఆర్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక్కడి టికెట్ ఆశావహుల్లో కళా వెంకటరావును విజయనగరం జిల్లాకు పంపించే ప్రయత్నం చేస్తుండగా కలిశెట్టి అప్పలనాయుడును గాలి కొదిలేశారని, ఇప్పుడు తామంతా బీజేపీ అభ్యర్థికి ఊడిగం చేయాలా.. అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టికెట్ రేసులో చివరి వరకు ఉండి భంగపడ్డ కలిశెట్టి అప్పలనాయుడును ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఏం చేయాలన్న దానిపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీకి కష్టపడి పనిచేస్తే ఇచ్చిన గౌరవం ఇదేనా అని కలిశెట్టి అప్పలనాయుడు కూడా మదనపడుతున్నారు. ముందే తెలుసా..? ఎచ్చెర్ల సీటు బీజేపీకి అందునా తన సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు కేటాయించాలని చంద్రబాబు మదిలో ముందుగానే ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు తెలిసే కళా వెంకటరావు, కలిశెట్టిని వాడుకుని వదిలేశారని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసం సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేశారని ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తూర్పు కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో క మ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించడమేంటని తప్పు పడుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు లీకులు వచ్చినా స్థానిక టీడీపీ క్యాడర్ పెద్దగా నమ్మలేదు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించడంతో అంతా నిశ్చేష్టులైపోయారు. -
పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. నన్నే పక్కన పెడతారా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధిష్టానం వద్ద మాట చెల్లడం లేదు.. స్థానికంగా పరువు దక్కడం లేదు. కమిటీలో స్థానం దక్కక, నమ్ముకున్న నాయకుడు పట్టించుకోక టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పరిస్థితి కళావిహీనంగా మారింది. ఒకప్పుడు అగ్రనేతగా వెలిగిన ఆయన ప్రభ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చంద్రబాబు జైలుకెళ్లాక లోకేష్ వద్ద కళా మాట చెల్లుబాటు అవుతుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవుతోంది. అచ్చెన్నాయుడు కంటే తనకే పెద్దపీట వేస్తారని కళా కూడా భావించినా.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. కమిటీల్లో దక్కని చోటు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఆ పార్టీని నడిపించే బాధ్యతలను కొందరు సీనియర్లు తీసుకుంటున్నారు. జైలులో ఉన్న చంద్రబాబు డైరెక్షన్లో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యక్షంగా ఉండని కారణంగా పార్టీ కార్యక్రమాలు, మిత్రపక్షమైన జనసేనతో సమన్వయం చేసుకునేందుకు రెండు కమిటీలు కూడా నియమించారు. పొలిటకల్ యాక్షన్ కమిటీలో యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామునాయుడు, నక్కా ఆనంద్‌బాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్, నారా లోకేష్‌లను సభ్యులుగా నియమించారు. జనసేనతో సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్యలను సభ్యులుగా నియమించారు. ఇంత మంది సీనియర్లను గుర్తించినా పార్టీ అధ్యక్షుడిగా ఇదివరకు పనిచేసిన కళా వెంకటరావును మాత్రం విస్మరించారు. ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం దక్కలేదు. పార్టీ కీలక మీటింగ్‌లకు కూడా ఆయనకు ఆహ్వానాలు అందడం లేదు. దీంతో ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేననే భావన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. అంతర్మధనం మొదలు.. కళా వెంకటరావుకు ప్రాధాన్యత తగ్గించడంతో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. కీలక కమిటీల్లో చోటు దక్కకపోవడంతో తన ప్రాబల్యం తగ్గిపోయిందని మధన పడుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సన్నిహిత వర్గాల వద్ద, తెలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆవేదన చెందినట్టు తెలిసింది. తన కోసం నాలుగు ముక్కలు మాట్లాడండి.. రాయండి అని కూడా కోరినట్టు ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి కళా విహీనాన్ని కళ్ల ముందు చూస్తున్నామని ఆయన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ కేడర్ ఆనంద పడుతుండగా.. తమ నాయకుడికి ఈ పరిస్థితేంటని, ఎందుకిలా జరుగుతుందని తన అనుచరవర్గం బాధపడుతోంది. రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ చంద్రబాబు జైలుకెళ్లిన పరిణామాలు ఆందోళన కలిగిస్తుంటే, ఇక్కడ మాత్రం తమ నాయకుడికి కీలక సమయంలో గుర్తింపు దక్కలేదని ఆయన వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. పట్టు తగ్గడమే కారణమా? పొలిట్ బ్యూరో, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకటరావును కనీసం గుర్తించకపోవడం వెనక ఆయన పట్టు తగ్గిపోవడమే కారణంగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు జైలుకెళ్లాక లోకేష్ సన్నిహితుడిగా ముద్రపడిన కళా వెంకటరావుకు ప్రాధాన్యత పెరుగుతుందనుకుంటే.. అనూహ్యంగా తగ్గిపోవడం చూసి కళా పరిస్థితిపై పార్టీ శ్రేణులు బేరీజు వేసుకుంటున్నాయి. సొంత నియోజకవర్గమైన రాజాంలో సీన్ లేకపోవడం, వలస వచ్చిన ఎచ్చెర్లలో కేడర్ పట్టించుకోకపోవడం, జనాల్లో ఆదరణ కొరవడటంతో కళా పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. మాట చాతుర్యం, బయట డాబు తప్ప ఇంకేమీ లేదని అటు కేడర్‌కు, ఇటు అధిష్టానానికి అర్థమైపోయినట్టు ఉంది. నియోజకవర్గంలో నెట్టుకురాలేని నాయకుడిని రాష్ట్రస్థాయిలో గుర్తించడం సరికాదనే అభిప్రాయమో మరేంటో తెలియదు గాని పార్టీ కీలక సమయంలో ఆయనకేమాత్రం స్థానం కల్పించలేదు. పార్టీలో పాత్ర పోషించే అవకాశం ఇవ్వలేదు. -
మహానాడు వేదికగా కళాకు చంద్రబాబు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు పెద్ద ఝలక్కే తగిలింది. స్థానిక నియోజకవర్గంలోనే కాదు అధిష్టానం వద్ద కూడా ఆయనకు విలువ లేదని తేలిపోయింది. కళా తన మాట నెగ్గించుకోవడానికి చేసిన యత్నాలు ఫలించలేదా? కళా వెంకటరావు మాటలను అధిష్టానం పెడచెవిన పెట్టిందా? ఆయన వైఖరిని తేలికగా తీసుకుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న కలిశెట్టి అప్పలనాయుడును తొక్కి పెట్టాలని, పార్టీలో ఆయనకు ఎలాంటి స్థానం లేదని, నియోజకవర్గంలో అంతా తానేనని కిమిడి కళా వెంకటరావు చూపించిన దూకుడుకు అధిష్టానమే చెక్ పెట్టింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తన ప్రాబల్యానికి అడ్డు తగులుతున్నారని, చాపకింద నీరులా తనకు పోటీ గా తయారవుతున్నారని, అడుగడుగునా తన హవాను తగ్గించడమే కాకుండా టీడీపీ కేడర్‌ను తనవైపు లాక్కుంటారన్న ఉద్దేశంతో కలిశెట్టి అప్పలనాయుడుపై కిమిడి కళా వెంకటరావు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కలిశెట్టిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. చివరికి కలిశెట్టి అప్పలనాయుడ్ని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ జిల్లా నాయకత్వం నుంచి ప్రకటన కూడా జారీ చేయించారు. అయితే కలిశెట్టి మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను సస్పెండ్ చేసినప్పటికీ ఆ ప్రకటన చెల్లదంటూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నా రు. నియోజకవర్గ టీడీపీలో కళాకు దీటుగా ముందుకెళ్తున్నారు. చెప్పాలంటే కళా కంటే తన వెంటే కేడర్ ఉండేలా కలిశెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అయితే కళా వెంకటరావు తన రాజకీయ చాతుర్యంతో కలిశెట్టి అప్పలనాయుడుకు పార్టీ కార్యక్రమాల్లో గౌర వం లేకుండా చేస్తున్నారు. పార్టీ నిర్వహించే సభలు, సమావేశాల్లో కలిశెట్టిని దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన పార్టీ మినీ మహా నాడులో కలిశెట్టిని వేదికపైకి రానివ్వలేదు సరికదా నోటికొచ్చినట్టు మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండైన వ్యక్తిని ఎలా వేదికపైకి పిలుస్తారని.. ఆహ్వానం పలికిన కనకల మురళీమోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పార్టీలో కళా చెప్పినదే వేదమన్నట్టుగా మినీ మహానాడు సాగింది. ఎందు‘కళా’.. జిల్లా స్థాయిలో తన హవా చూపించిన కళా వెంకటరావు...రాజమహేంద్రవరంలో రాష్ట్ర పార్టీ నిర్వహించిన మహానాడులో చూపించలేకపోయారు. తనకు ప్రత్యర్థి, పార్టీ నాయకత్వంతో సస్పెన్షన్‌కు గురైన కలిశెట్టి అప్పలనాయుడును మాత్రం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకున్నారు. ఒకచోట కూర్చొని కలిశెట్టితో మాట్లాడారు. హోటల్లో ఏర్పాటు చేసిన విందులో కలిశెట్టిని చంద్రబాబు ఏకంగా సత్కరించారు. దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సందేహంలో పడ్డాయి. సస్పెండ్ చేసిన వ్యక్తిని మినీ మహానాడుకు పిలవడమేంటని కళా అడ్డుకుంటే.. అదే వ్యక్తిని ఏకంగా అధినేత చంద్రబాబు సత్కరించడం చూస్తే టీడీపీలో సస్పెన్షన్ ప్రకటనకు విలువ లేదా? లేదంటే కళా వెంకటరావు ప్రాబల్యాన్ని తగ్గించాలని చేసే ఎత్తుగడా? అన్న చర్చ మొదలైంది. అక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే కళా రాజకీయ వ్యూహాలు, అనుసరిస్తున్న వైఖరి, జారీ చేస్తున్న హకుంను చంద్రబాబు పట్టించుకోకుండా కలిశెట్టిని సత్కరించారనే అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో టీడీపీలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం వ్యూహమేంటో తెలియడం లేదని, తాము ఎవరివైపు ఉండాలో తెలియని సందిగ్ధం నెలకొందని, చివరికీ పార్టీ ఎవరికీ పెద్ద పీట వేస్తుందో అంతు చిక్కడం లేదని, అంతవరకు తాము ఎవరి వెంట తిరగాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులు అంతర్మధనంలో పడ్డాయి. -
కళా వెంకటరావు సెల్ఫీ చాలెంజ్ చూసి నవ్వుకుంటున్న జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ భవనాన్ని చూపిస్తూ టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సెల్ఫీ సవాల్ విసిరారు. కానీ ఆ భవనాన్ని టీడీపీ హయాంలో నిర్మించలేదు. దీంతో ఆయన అభాసుపాలయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 21వ శతాబ్దపు గురుకులం కోసం రూ.18 కోట్లతో తొమ్మిది బ్లాక్‌ల భవనాన్ని నిర్మించారు. ని ర్మాణంలో ఉండగానే వైఎస్సార్ మరణంతో ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీని ఇక్కడ ఏర్పాటు చేశారు. కొత్తగా భవనం నిర్మించకుండా వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించారు. ఇక ట్రిపుల్ ఐటీ తమ గొప్పతనంగా టీడీపీ చెప్పుకుంటోంది. ట్రిపుల్ ఐటీ అనగానే గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే. ఆయన కలల విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీ. ఆయన హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశా రు. అందులో శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేయా లని భావించారు. ఈ లోపు ఆయన మరణించడంతో ముందుకు సాగలేదు. టీడీపీ వచ్చాక ట్రిపుల్ ఐటీని వైఎస్సార్ నిర్మించిన భవనంలో ప్రారంభించింది. అది కూడా ఒక బ్యాచ్‌నే నడిపింది. దాంట్లో కూడా వైఎ స్సార్ నిర్మించిన భవనంలో 500మంది బాలికలతో, అద్దెకు తీసుకున్న మిత్రా ప్రైవేటు కళాశాలలో 500మంది బాలురుతో నడిపింది. వారి హయాంలో కొత్తగా ఒక్క భవనం కూడా నిర్మించలేదు. ఇవన్నీ మర్చిపోయి కళా ఇక్కడ సెల్ఫీ దిగడంతో ప్రజలే కాదు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. అన్నీ బొంకులే దాదాపు రూ.100 కోట్లతో టీడీపీ హయాంలో నిరుపేద విద్యార్థుల కోసం ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీని తీసుకువచ్చామని కళా అవాస్తవాలను పోస్టు చేశారు. అయితే ఇక్కడే కళా పప్పు లో కాలేశారు. టీడీపీ హయాంలో కేవలం రూ.43 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. వారి హయాంలో భవన నిర్మాణం చేపట్టలేకపోయారు. అరకొర నిర్మాణాలు చేపట్టి గాలికొదిలేశారు. దీంతో టీడీపీ పాలన సాగిన 2017లో కేవలం ఒక బ్యాచ్‌ను మాత్ర మే నడపగలిగారు. పీయూసీ 1 బ్యాచ్‌ను వెయ్యి మంది( 500బాలికలు, 500బాలురు)తో ప్రారంభించారు. తర్వాత సంవత్సరం చేరే బ్యాచ్‌కు భవనాల్లేక నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇక్కడి విద్యార్థులను పంపించారు. ట్రిపుల్ ఐటీలో పీయూసీ 1, పీయూసీ 2, ఇంజినీరింగ్ 1, ఇంజినీరింగ్ 2, ఇంజినీరింగ్ 3, ఇంజినీరింగ్ 4 తరగతులుంటాయి. టీడీపీ హయాంలో కేవలం పీయూసీ 1 బ్యాచ్‌ను ప్రారంభించి, ఆ తర్వా త భవనాలు సమకూర్చలేక చేతులేత్తేసి తర్వాత సంవత్సరం పీయూసీ 1లో చేరే విద్యార్థులను నూజివీడుకు తరలించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అరకొరగా జరిగిన నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపు 4వేల మంది విద్యార్థులకు సరిపడా జీప్లస్ 5 భవనా న్ని రూ. 131కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీంతో నాలుగు బ్యాచ్‌ల(పీయూసీ 1, పీయూసీ2, ఇంజినీరింగ్1, ఇంజినీరింగ్2)ను నడుపుతోంది. అంతటితో ఆగలేదు. 2024 నాటికి ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సును విద్యార్థులు ఇక్కడే పూర్తి చేసే లా లక్ష్యం పెట్టుకుని రూ. 67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను ప్రస్తుతం నిర్మిస్తోంది. ఇది కాకుండా దాదా పు 6,600మందికి సరిపడా వసతి సౌకర్యాలను క ల్పించేందుకు రూ.133కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా చేసింది. అభాసుపాలు వాస్తవాలన్నీ వదిలేసి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ఘనత మాదే అంటూ కళా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే నిజం తెలిసిన ప్రజలు కళా సెల్ఫీ చూసి అవాక్కయ్యారు. జిల్లా టీడీపీ శ్రేణులు సైతం కళా వేషాలు చూసి నవ్వుకుంటున్నారు. అనవసర సెల్ఫీ చాలెంజ్‌లతో అభాసుపాలవుతున్నామని బాధ పడుతున్నారు. రిమ్స్, బీఆర్‌ఏయూ, వంశధార ప్రాజెక్టు, నాడు–నేడు స్కూళ్లు, ఆర్బీకేలు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వంటి పనులు ఏమైనా టీడీపీ చేపట్టి ఉంటే చెప్పుకోవాలి గానీ ఇలా తమవి కాని భవనాల వద్ద సెల్ఫీలు దిగి రాజకీయాలు చేయడం సరికాదని జనమంటున్నారు. -
ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షాలకు పనికిమాలిన నాయకులే కావాలి తప్ప చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అంటేనే ప్రజలు తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. మోదీకన్నా సీనియర్ నేత ఒక్క చంద్రబాబు మాత్రమేనని, ఏపీ ముఖ్యమంత్రికి చాలా అనుభవం ఉందంటూ కొనియాడారు. ప్రజల మధ్య మీటింగ్స్ పెట్టి గట్టిగా మాట్లాడితే ప్రజలు తంతారనే భయం బీజేపీ నేతలకు పట్టుకుందని కళా వెంకట్రావ్ చెప్పారు. -
విశాఖ మహానాడును జయప్రదం చేయండి
- కళా వెంకట్రావు ప్రత్తిపాడు/ఏలేశ్వరం : విశాఖలో ఈ నెల 27,28,29 తేదీల్లో జరగనున్న మహనాడును విజయవంతం చేయాలని పార్టీ పరిశీలకుడుమ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కోరారు. ప్రత్తిపాడు మండలం లంపకలోవ పామాయిల్ తోటలో మంగళవారం జరిగిన మినీ మహనాడు సభలో ఆయన ప్రసంగించారు. మహనాడులో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 17 అంశాలు, తెలంగాణాకు సంబంధించి ఏడు, మరో ఐదు ఇతర అంశాలను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. రూ.17వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాటు పడుతున్నారన్నారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయిందని చెప్పారు. కోటిపల్లి – నర్సాపురం, పిఠాపురం – కాకినాడ రైల్వేలైన్లు పూర్తి చేస్తామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కాకినాడు–కోటిపల్లి–నర్సాపురం, పిఠాపురం–కాకినాడ రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 630 కోట్లు రైల్వేశాఖ కేటాయించిందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో పార్టీలో విభేదాలు లేవన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి పదవులు వస్తున్నాయన్నారు. ఈ సభలో సాగు నీటి ప్రాజెక్టులు – వాటి పరిస్థితులు, పార్టీ అభివృద్ది, విధి విధానాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, రాష్ట్రాభివృద్ధి, బీసీ సంక్షేమం తదితర అంశాలపై జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు, వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి మూలారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త పర్వత రాజబాబుతోపాటు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పదవులు పొందిన చిక్కాల రామచంద్రారావు, గన్ని కృష్ణ, సత్యనారాయణరాజులను మంత్రి యనమల శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమానికి తొలుత పార్టీ పతాకాన్ని ఎంపీ తోట ఆవిష్కరించగా, పార్టీ నాయకుల మృతికి సమావేశం మౌనం పాటించింది.