సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనుకున్నదంతా అయ్యింది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపినా.. మంగళగిరిలో కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా ఎచ్చెర్ల టీడీపీ ఆశావహులకు నిరాశ తప్పలేదు. తూర్పుకాపులు అత్యధికంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నడికుదుడి ఈశ్వరరావును బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా ప్రకటించా రు. ఐదేళ్లుగా అక్కడ టీడీపీని నిలబెట్టుకుంటూ వస్తున్న కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడులకు వెన్నుపోటు పొడిచి సీటును బీజేపీకి కట్టబెట్టేశారు. వీరిద్దరి తగువు తీర్చలేక బీజేపీకి కేటాయించి తమ సామాజిక వర్గ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించేలా చంద్రబాబే పావులు కదిపారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. గత 58 నెలలుగా పార్టీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు. గత ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేశారు. ఇదిగో టికెట్ అని చెప్పి ఇద్దర్నీ ఊరించారు. ఆఖరి వరకు వారి సేవలను వాడుకున్నారు. టికెట్ ఖరారు చేసే సమ యానికి యూజ్ అండ్ త్రో మాదిరిగా వదిలేశారు.
చంద్రబాబు నిర్వాకం చూసి టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుని మమ్మల్ని బలి పశువు చేశారని ఆ పార్టీ నాయకులే దుమ్మెత్తి పోస్తున్నారు. డిపాజిట్లు రాని వ్యక్తికి టికెట్ ఇస్తే ఏం ప్రయోజనమని దుయ్యబడుతున్నారు. ఇక్కడ బీజేపీకి అంత సీన్ ఉందా.. అందులో ఎన్‌ఈఆర్‌కు కనీస ప్రజాదరణ ఉందా.. ఏమీ లేని వాడికి టికెట్ ఇస్తే మేం పనిచేయాలా?అలాంటి వ్యక్తికి తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. ఓడిస్తామని టీడీపీ శ్రేణులు శపథం పూనుతున్నాయి. ఇప్పటికే ఎన్‌ఈఆర్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి.
ఇక్కడి టికెట్ ఆశావహుల్లో కళా వెంకటరావును విజయనగరం జిల్లాకు పంపించే ప్రయత్నం చేస్తుండగా కలిశెట్టి అప్పలనాయుడును గాలి కొదిలేశారని, ఇప్పుడు తామంతా బీజేపీ అభ్యర్థికి ఊడిగం చేయాలా.. అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టికెట్ రేసులో చివరి వరకు ఉండి భంగపడ్డ కలిశెట్టి అప్పలనాయుడును ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఏం చేయాలన్న దానిపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీకి కష్టపడి పనిచేస్తే ఇచ్చిన గౌరవం ఇదేనా అని కలిశెట్టి అప్పలనాయుడు కూడా మదనపడుతున్నారు.
ముందే తెలుసా..?
ఎచ్చెర్ల సీటు బీజేపీకి అందునా తన సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావుకు కేటాయించాలని చంద్రబాబు మదిలో ముందుగానే ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. చంద్రబాబు తెలిసే కళా వెంకటరావు, కలిశెట్టిని వాడుకుని వదిలేశారని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసం సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేశారని ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తూర్పు కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో క మ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించడమేంటని తప్పు పడుతున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు లీకులు వచ్చినా స్థానిక టీడీపీ క్యాడర్ పెద్దగా నమ్మలేదు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించడంతో అంతా నిశ్చేష్టులైపోయారు.
Comments
Please login to add a commentAdd a comment