బాబు ఉన్న బస్సు నుంచి బయటకు వెళ్లిపోతున్న గుండ లక్ష్మీదేవి దంపతులు , వారు విడుదల చేసిన లేఖ
రాజకీయాలకు దూరంగా ఉంటామని చంద్రబాబు ముందే చెప్పిన వైనం
అభ్యర్థి మార్పు ఉండదని చంద్రబాబు స్పష్టీకరణ
చంద్రబాబును కలవాలని గంటన్నర ముందు కలమటకు ఫోన్ చేసిన దూతలు
ఇప్పటికప్పుడు రాలేనని ఫోన్‌లో చెప్పేసిన పాతపట్నం నేత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బాబు దెబ్బకు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులైన గుండ లక్ష్మీదేవి దంపతులు రాజకీయాలకు టాటా చెప్పేశారు. టికె ట్ వస్తుందేమోనని దింపుడు కళ్లెం ఆశతో ఇన్నాళ్లూ గడిపిన గుండ దంపతులకు టికెట్ మార్పు ఉండదని చంద్రబాబు స్పష్టం చేయడంతో రాజకీయాల్లో తాము ఉండలేమని ఆయన ముందే తేల్చి చెప్పేశారు. నేర ప్రవృత్తి కలిగిన వారికి, అవినీతి పరులకు పెద్దపీట వేసే మీలాంటి వారితో రాజకీయాలు చేయలేమని, ఏకంగా రాజకీయాలకే దూరంగా ఉండిపోతామంటూ గుండ లక్ష్మి దంపతులు చంద్రబాబుకు దండం పెట్టేశారు. మరో నాయకుడు కలమట వెంకటరమణ తాను వచ్చి బాబును కలవలేనంటూ ఫోన్‌లోనే తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇప్పుడిది జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
రమ్మని పిలిచి..
హైదరాబాద్ పిలిపించుకుని గుండ దంపతులకు న్యాయం చేస్తానని చెప్పిన చంద్రబాబు జిల్లాకొచ్చి నో చెప్పేశారు. మంగళవారం ఉదయం తనను కలవాలని కబురు పంపించడంతో హుటాహుటిన తన కుమారుడితో కలిసి గుండ అప్పల సూర్యనారాయ ణ, లక్ష్మీదేవి దంపతులు పలాసలో బస చేసిన చంద్రబాబు వద్దకు వెళ్లారు. బస్సులో తనను కలిసిన గుండ దంపతులకు ముఖం మీదే ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేశారు. శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, ప్రస్తుత అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని, అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవో...ఎమ్మెల్సీ పదవో ఇస్తానని...2029 ఎన్నికల్లో మీ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు.
ముఖం చాటేసిన కలమట
పాతపట్నం టికెట్ ఆశించి భంగపడిన కలమట వెంకటరమణకు మంగళవారం ఉదయం 8.15గంటల సమయంలో చంద్రబాబు నుంచి ఫోన్ వెళ్లింది. 10 గంటల్లోపు పలాసలో బస చేసిన తమను కలవాలని కోరారు. దానికి కలమట నో చెప్పేశారు. 10 గంటల్లోపైతే రాలేనని చెప్పి ఇంటి వద్దే ఉండిపోయారు. అక్కడికి వెళితే ఆఫర్లు తప్ప మరేదీ ఉండ దని అభిప్రాయానికి వచ్చేసి చంద్రబాబును కలవడానికి కలమట ఇష్టపడలేదని తెలుస్తోంది. అభ్యర్థి మార్చుతానన్న ప్రకటన తప్ప తనకు ఏ ఆఫర్ వద్దని, ఎలాగూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమైపోయాయని, మామిడి గోవిందరావుతో కలి సి పనిచేసేది లేదని తన కేడర్ వద్ద చెప్పేశారు. మధ్య లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఏదో రాయబారం చేయడానికి ప్రయత్నించినా, నేనున్నాని భరోసా ఇచ్చినా కలమట వెనక్కి తగ్గలేదు. మాటలొద్దు.. చేతలు కావాలని ఎంపీ వద్ద అన్నట్టుగా తెలుస్తోంది.
నచ్చేచెప్పేందుకు యత్నించినా... నో అంటూ ..
అన్నీ విన్న గుండ దంపతులు మీ రాజకీయాలకు నమస్కారం...మాకే పదవులొద్దు... నేరప్రవృత్తి గల వారికి, అవినీతి పరులకు పెద్దపీట వేసే తరుణంలో తామీ రాజకీయాల్లో ఉండలేమని...క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోతామని చెప్పేసి బస్సు దిగేసి వెనక్కి వచ్చేశారు. వెళ్లిపోతున్న వారిని వెనక్కి పిలిచి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా గుండ దంపతులు ఆగలేదు. సీరియస్‌గానే బయటికొచ్చేసి చంద్రబాబుకు ఏ విషయాలైతే చెప్పారో అదే విషయాలను ప్రస్తావిస్తూ ఒక నోట్ కూడా విడుదల చేశారు. అనుచరులు ఏదో ఒక దారి చూసుకోవాలని పరోక్షంగా చెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment