ఎచ్చెర్ల నియోజకవర్గం దాదాపు బీజేపీకే కేటాయింపు
కళాపై వ్యతిరేకత, కలిశెట్టిపై అపనమ్మకమే కారణం
అయోమయంలో ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల టీడీపీలో విచిత్ర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాదాపు మూడేళ్లుగా ఈ అసెంబ్లీ సీటు కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతుంటే.. పొత్తు పొడుపంటూ చంద్రబాబు మూడో వ్యక్తికి కట్టబెట్టేశారు. దీంతో ఆ ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఇన్నాళ్లూ ఎచ్చెర్ల సీటు తమదంటే తమదేనంటూ పోటీ పడిన సీనియర్ నాయకుడు కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరిలో కళా వెంకటరావును విజయనగరానికి పంపిస్తున్నారు. కలిశెట్టిని మాత్రం ఇన్నాళ్లూ వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారు. దీనిపై స్థానికంగా విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నా చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.
ఎందుకొచ్చిన గొడవని..
ఎచ్చెర్ల టీడీపీలో నువ్వానేనా అన్నట్టుగా టిక్కెట్ పోరు ఉండేది. ఒకవైపు సీనియర్ నాయకులు కిమిడి కళా వెంకటరావు, మరోవైపు ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు పోటీ పడ్డారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని ముందుకు సా గారు. అయితే కళా వెంకటరావుకు స్థానికంగా సానుకూలత లేకపోవడం, కలిశెట్టి అప్పలనాయుడు సామర్థ్యంపై పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడంతో ఎందుకొచ్చిన గొడవ అని పొత్తులో ఈ సీటు బీజేపీకి కేటాయించినట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే బీజేపీ రంగం సిద్ధం చేసుకోవడమే కాకుండా టీడీపీ ప్రధాన ఆశావహులతో పాటు ఆ పార్టీ కీలక నాయకులను కలుస్తున్నారు.
విజయనగరానికి కళా..
శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకటరావును పూర్తిగా పక్కన పెట్టేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. చీపురుపల్లి నుంచో లేదా గజపతినగరం నుంచో లేదా విజయనగరం ఎంపీగానో పోటీ చేయించేందుకు పరిశీలిస్తున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి విజయనగరం జిల్లాలో బలమైన నాయకుడు లేడని చెప్పి కళా వెంకటరావును అక్కడకు బలవంతంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కళా వెంకటరావు ఆసక్తి చూపకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం సందిగ్ధంలో ప డింది. ఆ జిల్లాలో ఎక్కడకు వెళ్లినా టీడీపీకి క్యాడర్ లేదు. ఏమీ లేనిచోట తానేమి చేస్తానని కళా వెనక్కి తగ్గుతున్నారు. కానీ చంద్రబాబు మనసు కరగడం లేదు.
రోజుకొక ప్రతిపాదన
ఎచ్చెర్ల బీజేపీకి కేటాయిస్తే కలిశెట్టి అప్పలనాయుడు కూడా గాలిలో ఉండాల్సి వస్తోంది. ఈయనను కాస్త సంతృప్తి పరిచేందుకు, అధిష్టానం దృష్టిలో ఉన్నావని నమ్మకం కలిగించేందుకు విజయనగరం ఎంపీ కోసం కలిశెట్టి అప్పలనాయుడు పేరుతో ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించారు. కలిశెట్టి మాదిరిగానే విజయనగరం జిల్లాలో సీటు దక్కని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మాజీ ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్ పేర్లతో కూడా ఐవీఆర్‌ఎస్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలన్నీ కేవలం డ్రామాలేనని ఆ పార్టీ నాయకులకు సైతం తెలుసు. సర్వేల ఆధారంగా కాకుండా డబ్బే ప్రా మాణికంగా తీసుకుని, కోట్లిచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సానుకూలత ఏదీ..?
ఎచ్చెర్ల సీటును దాదాపు బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ తరఫున నడికుదిటి ఈశ్వరరావు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీ, జనసేన నాయకులతో పా టు టీడీపీ నాయకుల వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కళా వెంకటరావును సైతం కలిసినట్టు సమాచారం. అయితే, ఆయన్ని నుంచి వ్యతిరేకత ఎదురైనట్టు తెలిసింది. ఎచ్చెర్ల టిక్కెట్ తనకే వస్తుందని, అవసరమైతే చంద్రబాబుతో మాట్లాడుకోవచ్చని ప్రతిస్పందించినట్టు తెలియవచ్చింది. ఇలా ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అన్నట్టుగా టీడీపీ నాయకుల వద్దకు వెళ్లడమే తప్ప సానుకూలత చూపించడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మనోడు అనేనా..?
జిల్లాలో అత్యధిక తూర్పు కాపులున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. ఇక్కడ దాదాపు తూర్పు కాపు సామాజిక వర్గాల వారే దాదాపు బరిలో ఉంటూ వస్తున్నారు. కానీ, తొలిసారి కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తున్నారు. బీజేపీ నుంచి రేసులో ఉన్నది మనోడే(నడికుదిటి ఈశ్వరరావు) అని ముందే గ్రహించి వ్యూహాత్మకంగా పొత్తులో భాగంగా బీజేపీకి వదిలేస్తున్నారు. ఈ నిర్ణయం చూసి అటు టీడీపీ, జనసేనతో బీజేపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయాయి. తూర్పు కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించడమేంటని తప్పు పడుతున్నా రు.
ఓడిపోయే సీట్లలో ఇదొకటి చేరిందని బాహాటంగానే అనేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు బీజేపీకి ఇవ్వవద్దని టీడీపీ అధిష్టానానికి ఇక్కడి నుంచి ఫోన్‌లతో పాటు లేఖలు వెళ్తున్నాయి. ప్రధాన ఆశావహులు తమదైన శైలిలో లాబీయింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడి నేతలు కొంతమంది విజయవాడలో తిష్ట వేసి అధిష్టానంపై ఒత్తిడి కూడా చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు స్పందించడం లేదు. చూద్దామనే ధోరణిలో దాట వేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment