కంచిలి, పలాస, టెక్కలి: సభల్లో ఖాళీ కుర్చీలు, ప్రసంగాల్లో ‘సంకారావాలు’, విమర్శల్లో కనిపించని ఆధారాలు.. కలగలిపి నారా లోకేష్ శంఖారావం మొదటి రోజే అభాసుపాలైంది. ఇచ్ఛాపురం సురంగి రాజావారి మైదానంలో ఆదివారం శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు ఇదే ప్రాంతానికి వచ్చి ఇచ్చిన హామీలు మర్చిపోయి మళ్లీ కొత్తగా గంపెడు హామీలు ప్రకటించారు. ఇచ్ఛాపురంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటామని తెలిపారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పరిశ్రమలను ఆదుకుంటా మని చెప్పారు. అయితే ఇచ్ఛాపురంలో స్థానిక టీడీపీ నేతలకు ప్రాధాన్యత కల్పించకపోవడం, జనసేన శ్రేణులను సభలోపలకు రానివ్వకపోవడంతో వాగ్వాదాలు జరిగాయి.
లోకేష్ ప్రసంగిస్తున్నప్పుడు జనం లేచి వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ అయిపోయాయి. అనంతరం పలాస సమీపంలోని కంబిరిగాం కూడలి వద్ద ఆదివారం సాయంత్రం సభ నిర్వహించారు. స్థానిక మంత్రి డాక్టరు సీదిరి అప్పలరాజుపై అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఇక్కడ కార్యకర్తలకు పెట్రోల్‌కూపన్లు పంచడం విశేషం. అలాగే స్టేజీ ముందు నాయకులు సెక్యూరిటీ సిబ్బంది దెబ్బలాడుకున్నారు. టెక్కలి సభలో ఆద్యంతం రెడ్‌బుక్ చూపిస్తూ లోకేష్ ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అత్యఽధికంగా కేసులు నమోదు చేసుకున్న టీడీపీ కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేసిన కక్ష సాధింపు చర్యలను రెడ్‌బుక్‌లో నమోదు చేయాలని ఆవేశంతో ఊగిపోయారు. ఇక్కడ సుమారు 5 గంటల సమయంలో సభ వద్దకు వచ్చినప్పటికీ కార్యకర్తలు పెద్దగా లేకపోవడంతో 6 గంటల వరకు కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. కార్యకర్తలకు బహిరంగంగానే రూ.500, రెండు క్వార్టర్ బాటిళ్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment