సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీది బలుపా..? వాపా..? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క పర్యటనతో చినబాబు లోకేష్ సమాధానం చెప్పేశారు. శంఖారావం పేరుతో అట్టర్ ఫ్లాప్ షో నిర్వహించి టీడీపీది వాపేనని రుజువు చేసేశారు. ఎంత ప్రయత్నించినా రెండు మూడు రోజుల ముందు నుంచీ ఆ సభలకు రెండు, మూడు వేల మంది కూడా హాజరు కాకపోవడం చూసి అసలుకే ఎసరొచ్చిందని ఆ పార్టీ శ్రేణులు బాధ పడుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నాయకుడికొచ్చిన జనాలు కూడా హాజరు కాకపోవడంతో లోకేష్‌కున్న ఇమేజ్, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం స్పష్టంగా తెలిసిపోయింది.
క్వార్టర్ మద్యం, బండికి పెట్రోల్ కూపన్, మనిషికింతని సొమ్ము, ప్రయాణించేందుకు వాహనాలు సమకూర్చినప్పటికీ లోకేష్ సభలకు జనాలు రాలే దు. అధికారంలో ఉన్నంత సేపూ ప్రజలను మోస గించి, హామీలను విస్మరించి, అభివృద్ధిని గాదిలికొదిలేశారన్న అభిప్రాయంతో ప్రజలంతా ఉండటంతో లోకేష్ పర్యటన పేలవంగా సాగింది. లోకేష్ పర్యటనతో అసలుకే ఎసరొచ్చిందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలమేంటో తేలిపోయిందని సాక్షాత్తు ఆ పార్టీ సానుభూతి పరులే వాపోయారు.
ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల...ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా సభలకు జనాల్లేరు. రెండు మూడు వేల మంది మాత్రమే కన్పించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెండు మూడేసి గ్రూపులు ఉన్నాయి. లోకేష్ పర్యటనతో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ గ్రూపులు ఆరాటపడ్డాయి. కానీ, ఖాళీ కుర్చీలతో వారికి వాస్తవ పరిస్థితులు చివరికి అర్థమయ్యాయి.
కుమ్ములాటకు కేరాఫ్..
► లోకేష్ పర్యటనతో పార్టీకి మేలు జరగకపోగా, ఆ పార్టీ బలహీనత బయటపడింది. దానికి తోడు గ్రూపు రాజకీయాలు గొడవలకు దారితీశాయి. లోకేష్ సాక్షిగానే కొందరు కొట్టుకున్నారు. దీనికంతటికీ తండ్రీకొడుకులు చెరో వర్గాన్ని ప్రోత్సహించడమే కారణమని సభలకు హాజరైన జనాలే వ్యాఖ్యానించారు.
► పలాసలో టీడీపీలో రెండు వర్గాలు గట్టిగా తన్నుకున్నాయి. సభా ప్రాంగణం వద్ద పిడిగుద్దులు గుద్దుకున్నారు. పలాస, మందస టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది.
► నరసన్నపేటలో బగ్గు లక్ష్మణరావు వర్గీయులు లోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ బగ్గు రమణమూర్తి వారిని అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. దీంతో బగ్గు లక్ష్మణరావు వర్గీయులు సభకు గైర్హాజరయ్యారు. టిక్కెట్ ఆశిస్తున్న బగ్గు శ్రీనివాసరావు కూడా హాజరు కాలేదు.
► శ్రీకాకుళంలో లోకేష్ సభకు ముందు రోజు రాత్రి గొండు శంకర్ ప్లెక్సీలను చించేశారు. అదేవిధంగా లోకేష్ పర్యటనలో గొండు శంకర్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈయన పేరు కూడా ప్రస్తావించలేదు. గొండు శంకర్‌ను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ప్రాధాన్యత లేని తాము ఎందుకు పనిచేయాలని ఆయన వర్గీయులంతా తిట్టిపోశారు.
► పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు వర్గాలు నువ్వానేనా అన్నట్టు వ్యవహరించడంతో లోకేష్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మామిడి ఫ్లెక్సీలను చాలా వరకు చింపేశారు. సభ జరిగిన రోజైతే మామిడి గోవిందరావును వేదికపైకి రానివ్వకూడదని కలమట చివరి వరకు ప్రయత్నించారు. కాకపోతే, మామిడి గోవిందరావు దూకుడుగా వెళ్లడంతో వేదికపైకి రానివ్వకుండా అడ్డుకోలేకపోయారు. ఒకానొక సందర్భలో ఇరువర్గాలు రక్తం వచ్చేలా కొట్టుకుంటారనే ప్రచారం జరగడంతో అంతా అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు.
► ఎచ్చెర్లలో కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య బహిరంగంగా ఫైట్ జరిగింది. లావేరులో జరిగిన సభ ప్రాంగణంలోకి కలిశెట్టిని రానివ్వకుండా కళా వెంకటరావు దగ్గరుండి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి కలిశెట్టి దూసుకుని వెళ్లడంతో కళా వెంకటరావు చేసేదేమి లేక వెనక్కి తగ్గారు. లేదంటే ఇక్కడ రక్తం వచ్చేలా కొట్టుకునేవారు.
కళింగ కోమట్లకు అవమానం
టెక్కలిలో కళింగ కోమట్లను లోకేష్ తీవ్రంగా అవమాన పరిచారు. తమ సామాజిక వర్గ సమస్యలను చెప్పేందుకు వచ్చిన కళింగ కోమట్ల పెద్దలను కలవకుండా ముఖం చాటేశారు. వీరిలో టీడీపీ నాయకులే ఎక్కువ మంది ఉన్నా లోకేష్ కలవలేదు. పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుంటే...లోకేష్ తన దగ్గరికి వచ్చిన వారిని కలవకుండా అవమాన పరిచారని కళింగ కోమటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన నాయకులకు తీవ్ర అవమానం
► రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందన్నది అందరికీ తెలిసిందే. ప్యాకేజీ రా జకీయాలతో చంద్రబాబు పంచన పవన్ కల్యాణ్ చేరినంతగా జనసైనికులు క్షేత్రస్థాయిలో కలవలేకపోతున్నారు. వారి ఆధిప త్యం ఎక్కువైపోతోందని టీడీపీ శ్రేణులు దగ్గరకు చేర్చుకోలేకపోతున్నాయి. దీంతో లోకేష్ పర్యటన ఆద్యంతం జనసేన నాయకులకు అవమానం ఎదురైంది. సభా ప్రాంగణంలో కి వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. లోకేష్ కూడా వారిని కలుపుకోవడానికి ఆసక్తి చూపలేదు. పొత్తు ధర్మం పాటించాలని పవ న్ కల్యాణ్ పిలుపు ఇవ్వడమే తప్ప టీడీపీ నుంచి ఆ ధర్మమేంటో కన్పించలేదని జనసైనికులు బాహాటంగానే పెదవి విరిచారు.
► ఇచ్ఛాపురంలో శంఖారావం సభకు రావద్దంటూ జనసేన నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అవమాన భారంతో జనసేన నాయకులు వెనుదిరిగారు.
► పలాసలో జనసేన నాయకులు చాలావరకు లోకేష్ సభకు హాజరు కాలేదు. ఆ పార్టీ నాయకుడు కోత పూర్ణచంద్రరావుకు కనీసం ఆహ్వానం అందలేదు. దీంతో లోకేష్ సభకు జనసైనికులు చాలా మంది దూరంగా ఉండిపోయారు. కొందరు వచ్చినా సభా ప్రాంగణంలోకి రానివ్వలేదు. దీంతో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెక్కలి, నరసన్నపేటలో కూడా దాదాపు ఇదే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment