అందాల నగరి.. స్వచ్ఛ సొగసరి
⇒స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు మూడో ర్యాంకు
⇒దేశంలో 500 నగరాలతో పోటీపడి విజయం
⇒గత ఏడాది కంటే మెరుగుపడిన ర్యాంకు
⇒ఢిల్లీలో కేంద్ర అవార్డు స్వీకరించిన కమిషనర్, కలెక్టర్
విశాఖపట్నం : అందాల నగరి విశాఖ మరో అవార్డును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 500 నగరాలతో పోటీపడి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడో ర్యాంకు సాధించింది. గత ఏడాది సాధించిన ఐదో ర్యాంకును అధిగమించడం ద్వారా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా నగరాలకు ర్యాంకులు ప్రకటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత జనవరి 7 నుంచి 9వ తేదీ వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక కేంద్ర బృందం ఈ సర్వే నిర్వహించింది. గత ఏడాది 75 నగరాలతో పోటీ పడి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన జీవీఎంసీని ఈసారి అంతకంటే మెరుగైన ర్యాంకులో నిలపాలని కమిషనర్ హరినారాయణన్ తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని నిరంతరం ప్రోత్సహిస్తూ కార్యోన్ముఖులను చేసి విజయం సాధించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయు డు నుంచి జీవీఎంసీ ప్రత్యేకాధికారి అయిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కమిషనర్ హరినారాయణన్ ఈ అవార్డును అందుకున్నారు.
చేపట్టిన చర్యలివి..
స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో భాగంగా నగరంలో లక్ష జనాభాకు సరిపోయేలా 138 సామూహిక మరుగుదొడ్డు నిర్మించారు. మరో 55 సామూహిక మరుగుదొడ్లను ఆధునికీకరించారు. ఆరు రైతు బజార్లలో వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మోడల్ కాలనీల్లో తడి–పొడి చెత్త విభజన, సేకరణ చేపట్టారు. బీచ్ రోడ్డు, జాతీయ రహదారి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో టాయిలెట్లు నిర్మించి, గోడలకు రంగులు వేశారు. వ్యాపార కూడళ్లలో చెత్త వేయడానికి డస్ట్‌బిన్స్, డంపర్‌బిన్స్ ఏర్పాటు చేశారు. ఈ లెర్నింగ్ ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు, స్వచ్ఛత యాప్ ఉపయోగించడంలో దేశంలోనే మొదటి స్ధానంలో జీవీఎంసీ నిలిచింది.
సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు: కమిషనర్
జీవీఎంసీకి చెందిన అందరు అధికారులు, సిబ్బంది.. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడవ ర్యాంకు సాధించగలిగామని జీవీఎంసీ కమిషనర్ హరినా రామణన్ అన్నారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. నగర ప్రజల సహకారం కూడా మరువలేనిదని.. మరిన్ని విజయాలు సాధించడానికి ఈ అవార్డు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.కాగా హరినారాయణన్ ఢిల్లీ నుంచి నేరుగా న్యూయార్క్‌లో జరిగే స్మార్ట్‌సిటీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు.
పరిశీలించిన అంశాలు
ర్యాంకుల ప్రకటనకు కొన్ని నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిపై ఆన్‌లైన్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అవేంటంటే..
సమాచార, విద్యా వ్యవస్థ
భవనాల నిర్మాణం
తాగునీటి సరఫరా
స్వచ్ఛభారత్ మిషన్
మరుగుదొడ్ల నిర్మాణం
సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్