
రాష్ట్రంలో ఉన్న పిల్లలు బాగుపడొద్దా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
తేజ: మాది చాలా పేద కుటుంబం. మా తమ్ముడు వైఎస్ఆర్ దయవల్ల ఇంజనీరింగ్ చదివి విప్రోలో 40 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. మా తమ్ముడి లాగే అందరూ చేయాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. మీ కొడుకు లాగా రాష్ట్రంలో ఉన్న పిల్లలు కూడా బాగుపడొద్దా అని చంద్రబాబును అడుగుతున్నాం. మా తల్లి రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు... ఆరోగ్యశ్రీ పుణ్యం వల్ల ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం రాలేదు.
వైఎస్ జగన్: చంద్రబాబు మోసాలు చేసేవి ఎంత గొప్పగా చేస్తాడంటే, సాఫ్ట్ వేర్ అంతా నేనే తెచ్చా, సెల్ ఫోన్లు నేనే తెచ్చా, హైదరాబాద్ నేనే కట్టా అంటాడు. ఎందుకు ఈయన మాటలు వింటున్నాం అనిపిస్తుంది. మాకు మరీ దారుణం. అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ సోది వేస్తాడు. ఒక్కోసారి ఆయన చెప్పేది ఏమీ అర్థం కాదు. మా చెవిలో పూలున్నట్లు అనుకుంటాడు, మేం తల ఊపుతాం. సాఫ్ట్వేర్లో చంద్రబాబు సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉండేది. ఆయన పదవి నుంచి దిగిపోయేసరికీ అంతే ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత 2009-10 నాటికి సాఫ్ట్వేర్లో మనం మూడో స్థానానికి వెళ్లాం. చంద్రబాబు హయాంలో సాఫ్ట్వేర్ ఎగుమతులలో 8.66 శాతం మన వాటా ఉంటే, వైఎస్ హయాంలో అది 14.93 శాతానికి పెరిగింది. చంద్రబాబు దిగిపోయే సరికి 909 కంపెనీలుంటే, వైఎస్ దిగేనాటికి అది 1584 కంపెనీలు అయ్యాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య కూడా అంతే. ఇన్నీ వాస్తవాలు అయినా చంద్రబాబు మాత్రం ప్రజల జ్ఞాపక శక్తి తక్కువన్న నమ్మకంతో గోబెల్స్ ప్రచారం చేస్తాడు. పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు.