
అబద్ధాలలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు
- ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిని బుద్ధి చెబుతారు
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
బూదగెవి(ఉరవకొండ) : అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు సరికొత్త గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన విలేరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కుడా చేపట్టలేకపోయారన్నారు. దేశంలో వృద్ధి రేటు పురోగతిలో రాష్ట్రం ముందుందని అబద్ధాలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో ఆ లెక్కల్లో ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. గడప గడపకూ వెళ్తున్న తమ వద్ద గ్రామీణులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
త్వరగా మరో అవకాశం ఇస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తమతో చెబుతున్నారన్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎదురవుతున్నా చంద్రబాబు మాత్రం పూటకో అబద్ధం చెబుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో రైతులకు 100 శాతం వ్యవసాయ రుణాలు ఇచ్చారని, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సాకుగా చూపుతూ చంద్రబాబు ఒక్క పైసా కుడా రుణాలు మంజూరు చేయలేదని విమర్శించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించిన ఆయన నీరుచెట్టు, ఇసుక మాఫియా, తాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఈ దోపిడీ సాగినట్లు తెలిపారు.
నోట్ల రద్దు సమాచారాన్ని కేంద్రం నుంచి ముందుగానే అందుకున్న చంద్రబాబు తన నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకున్నారని అన్నారు. చంద్రబాబు తన అవినీతి ధనంతో రాబోవు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాడని, అయితే ప్రజలు దీన్ని గమనించి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు తిప్పయ్య, బసవరాజు, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు నరసింహులు, తిమ్మప్ప, నాయకులు ధనంజయలు పాల్గొన్నారు.