తెల్లవారుజామున హాహాకారాలు
- గుత్తి సమీపంలో అదుపు తప్పి ఓల్వో బస్సు బోల్తా
- 17 మందికి తీవ్ర గాయాలు
- ఐదుగురి పరిస్థితి విషమం
- బాధితుల్లో హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ వాసులు
- సకాలంలో స్పందించిన పోలీసులు
అందరూ గాఢనిద్రలో ఉన్నారు. బస్సు రయ్‌య్‌య్...మని పరుగులు తీస్తోంది. మరికొన్ని గంటలు గడిస్తే గమ్యస్థానం చేరుకుంటారు. అంతలోనే ఒకరిపై మరొకరు పడిపోయారు. అందరికీ ఎక్కడబడితే అక్కడ రక్తగాయాలయ్యాయి. హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరిగిందో తెలియగానే ఒక్కసారిగా నిద్రమత్తు వదిలింది. ఒకవైపు రక్తమోడుతున్నా.. మరోవైపు తమ వారి కోసం చీకట్లోనే వెతకడం ఆరంభించారు. కొన ఊపిరితో ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. తెలతెలవారుతుండగా జరిగిన ఈ ఘటనతో వన్నేదొడ్డి-కొత్తపేట గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
- గుత్తి / గుత్తి రూరల్ (గుంతకల్లు)
గుత్తి మండలం వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య శనివారం తెల్లవారు జామున 3.30 గంటలకు జాతీయ రహదారిపై తెలంగాణ ఆర్టీసీ సంస్థకు చెందిన ఓల్వో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో 15 మంది ప్రయాణికులు సహా, బస్సు డ్రైవర్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎలా జరిగిందంటే..
హైదరాబాద్‌కు చెందిన టి–ఆర్టీసీ బస్సు 48 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి బెంగుళూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని వన్నేదొడ్డి– కొత్తపేట గ్రామాల మధ్య లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే అదృష్టశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ హిందూపురం, హైదరాబాద్, పత్తికొండ, కరీంనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారు.
గాయపడింది ఎవరెవరంటే...
హిందూపురానికి చెందిన సాల్మన్ సుధీర్, హైదరాబాద్‌కు చెందిన భాగ్యవతి, జ్యోతి(మనవరాళ్లు), హల్కా, విజయ్(దంపతులు), అఖిల, సురేశ్, విజయేంద్ర, ప్రణీత, వినయ్, గౌరి, సుజయ్, భరత్, బస్సు డ్రైవర్లు సీహెచ్‌వీ రావు(కరీంనగర్), శీనయ్య(హైదరాబాద్), కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నీలకంఠ, పంజాబ్‌కు చెందిన కుస్‌కుమార్ గాయపడిన వారిలో ఉన్నారు.క్షతగాత్రులందరినీ గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో అఖిల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి, జ్యోతి, భాగ్యవతి, హల్కా, విజయ్‌ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గుత్తి ఎస్‌ఐ చాంద్‌బాషా, ఏఎస్‌ఐ ప్రభుదాస్ సహా పామిడి సీఐ నరేంద్రరెడ్డి, పెద్దవడుగూరు ఎస్‌ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. చీకటిలోనే గాయపడ్డ వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకురాగలిగారు. ఆ తరువాత వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించారు. తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల చొరవను అభినందించారు.
ఫర్లాంగు దూరం ముందుకెళ్లి ఉంటే..
ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరో ఫర్లాంగు ముందుకెళ్లి బస్సు అదుపు తప్పి ఉన్నట్లైతే పెను ప్రమాదం జరిగేది. బస్సు బోల్తాపడిన సమీపంలోనే 33 కేవీ విద్యుత్ టవర్ ఉంది. దాన్ని బస్సు ఢీకొని ఉన్నట్లైతే ఏ ఒక్కరూ మిగిలి ఉండేవారు కాదు. అడుగుల దూరంలోనే ఘోరం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.