ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
- మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూటి ప్రశ్న
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): అధికారంలోకి రావడానికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జిల్లాకు ఇచ్చిన 32 హామీలలో ఓ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఇంత వరకు మొదలే కాలేదన్నారు. పాత పనులకు పైపై మెరుగులు దిద్ది అభివృద్ధి చేస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి ఓట్లు అడగాలని హితవుపలికారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు గతంలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని చేసి తమ నైతికతను చాటుకున్నారనీ, మంత్రుల ముసుగులో తండ్రీ, కొడుకులు చేపట్టిన ప్రచారాన్ని చూసి ప్రజలు మభ్య పడే రోజులు పోయాయన్నారు. అసమ్మతి నాయకులను నామినేటెడ్ పదవులను ఎర చూపుతుండటాన్ని కూడా నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.