ఏసీబీకి పట్టుబడిన వీఆర్‌ఓ కృష్ణ
రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రాజాంలో కలకలం
రాజాం/రాజాం రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్న వారి జాబితాలో తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి చేరారు. కంచరాం గ్రామానికి చెందిన రైతు నుంచి శుక్రవారం రూ. 4 వేలు లంచం తీసుకుంటూ కంచరాం–1 వీఆర్‌ఓ సీహెచ్ కృష్ణ అడ్డంగా ఏసీబీ పన్నిన వలలో చిక్కారు. ఈ సంఘటన రాజాం మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. కంచరాం గ్రామానికి చెందిన రైతు పొట్నూరు సత్యం వీఆర్‌ఓ కృష్ణను ఆరు నెలల క్రితం సంప్రదించి తాము నలుగురు అన్నదమ్ములమని, భూములకు సంబంధించి సర్వేనంబర్లు మ్యూటేషన్ చేసి పట్టాదార్ పాస్‌పుస్తకాలు తయారు చేసి అందించాలని కోరాడు. దీంతో ముగ్గురుకి చెందిన పాస్ పుస్తకాలను వీఆర్వో జారీ చేయగా.. సత్యం విషయానికి వచ్చేసరికి ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో సత్యం అప్పట్లోనే వెయ్యి రూపాయలను వీఆర్వోకు ఇచ్చాడు.
మిగిలిన సొమ్మును ఇవ్వడంలో రైతు జాప్యం చేయడంతో వీఆర్వో కూడా పాస్ పుస్తకాల పనిని చేయడంలో వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై పలుమార్లు బాధితుడు సత్యం వీఆర్‌ఓ కృష్ణను సంప్రదిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో విసిగెత్తిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ రంగప్రవేశం చేసి శుక్రవారం గ్రామంలో పల్స్ సర్వేలో ఉన్న వీఆర్‌ఓ కృష్ణకు రైతుతో ఫోన్ చేయించి మిగిలిన రూ. నాలుగు వేలు సొమ్మును ఇస్తానని చెప్పాడు. వీఆర్‌ఓను రైతు సత్యం కలిసి సొమ్మును అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు కృష్ణను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ చెప్పారు. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు.
కడుపు మండింది
పేద రైతునైన తనను వీఆర్వో కృష్ణ డబ్బుల కోసం నానా ఇబ్బందులకు గురిచేశాడు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో అనేక రాయితీలు కోల్పోయాను. అందుకే కడుపు మండి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.
– పొట్నూరు సత్యం, రైతు, కంచరాం
లంచం అడిగితే జైలే
ప్రజల తరఫున పనిచేయాల్సిన అధికార యంత్రాంగం అవినీతికి పాల్పడి లంచం పేరుతో వారిని వేధింపులకు గురిచేస్తే కృష్ణకు పట్టిన గతే పడుతుంది. ఎవరైనా సత్యం లాంటి బాధితులు ఉంటే తమకు తెలియజేయాలి. అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.
– రంగరాజ్, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం