ఏసీబీ వలలో వీఆర్వో
7 వేల నగదు స్వాధీనం
తర్లుపాడు : ఈ-పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి 7 వేల రూపాయల లంచం తీసుకున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సంఘటన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ ఒంగోలు ఇన్‌చార్జ్ డీఎస్పీ దేవానంద్ సాంతో కథనం ప్రకారం.. మండలంలోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన దూళ్ల వెంకట లక్ష్మమ్మ అదే గ్రామానికి చెందిన చింతం రాజయ్య వద్ద ఈ ఏడాది జనవరిలో 28 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేరుుంచుకుంది. తాను కొనుగోలు చేసిన పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఈ-పాస్ పుస్తకం ఇవ్వాలని వీఆర్వో వెంకట శివ కాశయ్యను ఆమె కోరింది. ఇందుకోసం మీ సేవలో దరఖాస్తు చేసి వీఆర్వోను సంప్రదించింది.
ఇందుకు వీఆర్వో 10 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పటంతో 7 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని వెంకటలక్ష్మమ్మ తమ కుమారుడు వెంకటేశ్వర్లుకు తెలిపింది. అతడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం రంగుపూసిన నోట్లను ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఆయన నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీఆర్వోకు ఆ నగదు ఇచ్చాడు. ఆయన ఆ డబ్బులు తీసుకుని డైరీలో పెట్టుకున్నాడు.
ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ దేవానంద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి వీఆర్వో వెంకట శివ కాశయ్య నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. విషయం క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో కార్యాలయంలోని మిగిలిన సిబ్బంది, వీఆర్వోలు బయటకు పరుగులు తీశారు. ఏసీబీ సీఐలు ప్రతాప్‌కుమార్, డి.సత్యకుమార్, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.