గుంతకల్లు రూరల్ : బస్సులోంచి దిగుతూ ప్రమాదవశాత్తు కాలుజారిపడిన ఘటనలో గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న తళారి మహేష్ (36) బుధవారం రాత్రి మృతి చెందారు. గుంతకల్లు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్న మహేష్ ప్రస్తుతం గుంతకల్లు మండలంలోని తిమ్మాపురం, నక్కనదొడ్డి గ్రామాలకు వీఆర్వోగా పనిచేస్తున్నాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం కిడ్నీవ్యాధికి గురైన మహేష్ అప్పటినుండి చికిత్స పొందుతూనే ఉన్నాడు. మహేష్ రెండు కిడ్నీలు పాడై పరిస్థితి విషమంగా మారడంతో 6 సంవత్సరాల క్రితం మహేష్ తల్లి కిడ్నీ దానం చేసింది.
అయినప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వారానికి రెండు సార్లు చొప్పున జిల్లా కేంద్రానికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వరకూ విధుల్లో ఉన్న మహేష్ డయాలసిస్ కోసం సాయంత్రం బయలుదేరాడు. అనంతపురం బస్టాండ్‌లో బస్ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్‌ను ఆంబులెన్స్ ద్వారా తోటి ప్రయాణికులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దహన సంస్కారాల నిమిత్తం తహసీల్దార్ హరిప్రసాద్ ఆ కుటుంబానికి రూ.15 వేలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేశారు.
బస్సులోంచి జారిపడి వీఆర్వో మృతి
Published Thu, Jul 13 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
Advertisement
Advertisement