కరెంట్ తీగను మింగేశారు!
- లైన్ మార్చకుండానే.. మార్చినట్లు రికార్డు
- ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల చేతివాటం
- ఎన్పీడీసీఎల్ సొమ్ము దుర్వినియోగం
హన్మకొండ : కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల అక్రమార్జన వెరసి.. అటు వినియోగదారులు, ఇటు ఎన్పీడీసీఎల్ సంస్థకు నష్టం జరుగుతోంది. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పు, లూజ్ లైన్లను సరిచేసేందుకు మిడిల్ పోల్స్ ఏర్పాటు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులను ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తోంది.
అయితే, ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఎన్పీడీసీఎల్‌లోని ఇంజనీర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక ఎంతో కొంత చేసిన పనిలో నాణ్యత లోపించ డం వంటి అంశాలను పక్కన పెడితే.. అసలు పనే చేయకున్నా చేసినట్లు సామగ్రి తీసుకుని, లేబర్ చార్జీలు విడిపించుకున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
లైన్ మార్చేందుకు నాలుగేళ్లు...
హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో బూర నరేందర్‌కు వెంకటరమణ ఆటో గ్యాస్ పేరు తో ఆటో గ్యాస్ డీలర్‌షిప్(బంక్) మంజూరైంది. ఆయన బంక్ మంజూరు చేయాలనుకున్న స్థలంలో విద్యుత్ లైను ఉండగా.. దాన్ని మారిస్తేనే బంక్ ఏర్పాటుకు అనుమతిస్తామని సంబంధిత కంపెనీ స్పష్టం చేసింది. దీంతో లైన్ మార్చడానికి అయ్యే ఖర్చులు రూ.34 వేలను డీడీ ద్వారా 2011 ఏప్రిల్‌లో ఎన్పీడీసీఎల్‌కు చెల్లించారు.
అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు విద్యుత్ లైన్ మార్చకపోవడంతో విసిగిపోయిన నరేందర్.. లైన్ మార్చకపోవడంతో తన గ్యాస్ డీలర్ షిప్ రద్దయ్యే ప్రమాదముం దని, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోని దిగిన ఓ ఉన్నతాధికారి విచారణ జరపగా విస్తుపోయే నిజం బయటపడింది. ఎల్లాపూర్‌లో విద్యుత్ లైన్ మార్చేందుకు మూడు విద్యుత్ స్తంభాలు, దీనికి సరిపడా విద్యుత్ వైర్‌ను స్టోర్ నుంచి డ్రా చేయడమే కాక, మెటీరియల్ తరలింపు, లైన్ మార్చేందుకు లేబర్ చార్జీల కింద రూ.7వేలు 2012 నవంబర్‌లో డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడాన్ని ఆయన గుర్తించారు.
అసలు లైనే మార్చనప్పుడు మెటీరియల్, లేబర్ చార్జీలు ఎవరికి చెల్లించారంటూ ఆయన ఆరా తీయగా.. చింతగట్టులో గతంలో పని చేసి ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్‌కు బదిలీ అయిన ఎన్పీడీసీఎల్ ఏఈ దీనికి బాధ్యుడిగా తేలింది. ఈ మేరకు సదరు ఏఈపై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. అయితే, సదరు ఏఈపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో తనిఖీలో చేస్తే అవి బయటపడతాయని సంస్థలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం.
కాగా, ఎల్లాపూర్‌లో లైన్ మార్పు కోసం తీసుకువెళ్లిన సామగ్రిని ఆ ఏఈ ఏం చేశాడనేది తేలాల్సి ఉంది. ఇక.. డీడీ చెల్లించిన నాలుగేళ్లయినా లైన్ చెల్లించని ఎన్పీడీసీఎల్ సంస్థపై ఆటో గ్యాస్ డీలర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చేస్తూనే డీలర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.