వరంగల్.. స్మార్ట్ సిటీ | warangal is a smart city said venkaih naidu | Sakshi
Sakshi News home page

వరంగల్.. స్మార్ట్ సిటీ

Published Wed, May 25 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

వరంగల్.. స్మార్ట్ సిటీ

వరంగల్.. స్మార్ట్ సిటీ

కేంద్ర ప్రభుత్వ జాబితాలో చోటు
నగరంలో మెరుగైన వసతుల కల్పన 
ఐదేళ్లపాటు రూ. 500 కోట్ల నిధులు

 సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రక నగరం వరంగల్ మరో అరుదైన ప్రత్యేకతను పొందింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీల (ఆకర్షణీయ నగరాల)  జాబితాలో వరంగల్ నగరానికి చోటు దక్కింది. దేశంలోని నగరాల్లో మెరుగైన వసతుల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్‌సిటీ పథకాన్ని ప్రకటించింది. ఐదేళ్లలో 100 నగరాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) ఆధారంగా స్మార్ట్ సిటీలను ఎంపిక చేస్తున్నారు. స్మార్ట్ సిటీల జాబితాలో చోటుకోసం మొదటిదశలో దేశవ్యాప్తంగా 100 నగరాలు పోటీపడ్డాయి.

మొదటి దశ కింద 2016 ఫిబ్రవరిలో 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశారు. అప్పుడు వరంగల్ 23వ స్థానంలో నిలిచింది. మొదటి దశలో అదనంగా 13 నగరాలను మంగళవారం ఎంపిక చేయగా, ఈ జాబితాలో వరంగల్ నగరానికి చోటు దక్కింది. రెండో విడత స్మార్ట్ సిటీలుగా ఎంపికైన 13 నగరాల వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు.

 ఏటా రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లు..
స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు మొత్తం రూ.500 కోట్లను నేరుగా కేటాయిస్తుంది. వరంగల్ నగరానికి సంబంధించి రూ.2861 కోట్లతో నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలా స్మార్ట్ సిటీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతితో రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలతో రూ.393, కేంద్ర ప్రాయోజిక పథకాలతో రూ.370కోట్లు, వివిధరుణాల రూ పంలో రూ.203 కోట్లు సమీకరించాలని ప్రణాళికలో ఉంది. మిగిలిన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు చేస్తాయని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీగా గుర్తించిన నగరాల్లో ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. దీన్ని సెంట్రల్ సిటీగా పేర్కొంటారు. ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, సుంద రంగా తీర్చిదిద్దుతారు. నగరం మొత్తం వినియోగమయ్యేలా అధునాతన ప్రజారవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

రెండో విడతలో ‘స్మార్ట్ సిటీ’లివే..
లక్నో (యూపీ), వరంగల్ (తెలంగాణ), ధర్మశాల, చండీఘడ్, రాయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్), న్యూటౌన్ కోల్‌కతా (పశ్చిమబెంగాల్), భగల్‌పూర్ (బిహార్), పానాజీ (గోవా), పోర్ట్‌బ్లెయిర్ (అండమాన్ అండ్ నికోబార్), ఇంఫాల్ (మణిపూర్), రాంచీ (జార్ఖండ్), అగర్తల (త్రిపుర), ఫరీదాబాద్ (హర్యానా). తొలి విడతలో 20 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 33 నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయి.

డీపీఆర్ మార్పులతోనే చోటు
స్మార్ట్ సిటీల ఎంపికలో తొలి జాబితాలో వరంగల్‌కు చోటు దక్కలేదు. అభివృద్ధి కోసం రూపొందించిన డీపీఆర్‌లోని లోపాల కారణంగానే ఇలా జరిగినట్లు కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ పేర్కొంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)కి ఈ ఏడాది మార్చిలో పాలకవర్గం ఎన్నికైంది. డీపీఆర్‌లోని లోపాలు సరిచేసి సమగ్రంగా రూపొందించాం. స్మార్ట్ సిటీల జాబితా కోసం ఏప్రిల్ 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వర్క్‌షాప్ నిర్వహించింది. 23 నగరాలు స్మార్ట్‌సిటీ ఎంపిక కోసం పోటీ పడ్డాయి. వరంగల్ అభివృద్ధి ప్రణాళికపై వర్క్‌షాప్‌లో డీపీఆర్‌ను వివరించాను. మెరుగైన డీపీఆర్‌తో వరంగల్‌కు స్మార్ట్ సిటీ హోదా దక్కింది. వరంగల్ నగరానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
- నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్.

Advertisement
Advertisement