- జిల్లా టార్గెట్ 4.50 కోట్లు
- ఇప్పటి వరకు నాటిన మొక్కలు
- 4.37 కోట్లు : కలెక్టర్ వాకాటి కరుణ
హరితహారంలో వరంగల్‌కు ప్రథమ స్థానం
Published Thu, Sep 22 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
హన్మకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ జిల్లాకు 4.50 కోట్ల టార్గెట్ ఉండగా.. ఇప్పటివరకు 4.37 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి 4.50 కోట్ల లక్ష్యానికి చేరుకోవాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేయడంలో కూడా వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తరచుగా తనిఖీలు నిర్వహించి మొక్కలు ఎన్ని బతికి ఉన్నాయి.. ఎన్ని చనిపోయాయనే విషయంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు.
పాఠశాలలను తనిఖీ చేయాలి..
జిల్లా, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ఒకేరోజు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. తనిఖీలు, రాత్రి బసలపై ప్రత్యేక తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. మారుమూల పాఠశాలల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అటవీ అధికారి శ్రీనివాస్, జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, సీపీఓ రాంచందర్‌రావు పాల్గొన్నారు.
Advertisement