-
ఎడతెరిపి లేని వర్షం
-
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
-
కొట్టుకుపోయిన రోడ్లు.. నీటమునిగిన పంటలు
-
జిల్లా కేంద్రాన్ని ముంచెత్తిన వరద
-
పొంగిపొర్లిన నాలాలు.. రాకపోకలకు అంతరాయం
-
పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
-
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
-
సహాయక చర్యల్లో నిమగ్నం
-
నగరంలో పునరావాస కేంద్రాలు
-
పరిస్థితిని సమీక్షిచిన డిప్యూటీ సీఎం, కలెక్టర్
హన్మకొండ అర్బన్ : భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. 12మండలాల్లో 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 90 శాతానికి పైగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరద ఉధృతికి 56 చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 17 ఇళ్లు పూర్తిగా, 168 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 14 గొర్రెలు, ఒక ఎద్దు మృత్యువాత పడ్డాయి. హన్మకొండ గోపాల్‌పూర్‌లోని 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తిగా నీటమునిగింది. వరంగల్ నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి.ఽ సుమారు 6వేల మందిని 17 పునరావాస కేంద్రాలకు తరలించారు. డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో చాలాచోట్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో బలుసుపూరి కృష్ణ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వరదలో పడి గల్లంతయ్యాడు.
26వేల హెక్టార్లు పంటన ష్టం
భారీ వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 26వేల హెక్టార్లు పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం పెరగకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు తగు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
నగరంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
నగరంలో వర్షాల వల్ల నీట మునిగిన కాలనీలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. హన్మకొండలోని గోపాల్‌పూర్, ఎస్‌ఆర్‌నగర్, శ్యామల గార్డెన్ ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని వారికోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు వరద ప్రాంతాల్లో పర్యటించారు.
కలెక్టర్ అత్యవసర సమావేశం
వర్షాలపై వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్‌తో కంట్రోల్ రూం 24గంటలూ పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, పశు సంవర్థక శాఖ. వైద్యారోగ్యశాఖ, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉదయం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు.
అధికారులు స్థానికంగా అందుబాటులో ఉంటూ వర్షాలు, వరదల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అన్ని ఆర్డీఓ కార్యాలయంలో వరదల సమాచారం విషయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చెరువును అధికారులు సందర్శించి పరిస్థితి సమీక్షించాలని, గండ్లు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు చాలావరకు తెరుచుకోలేదు.
అత్యధికంగా గీసుకొండలో 20 సెం.మీ వర్షం
గురువారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అత్యదిక వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, డోర్నకల్ మండలాలు మినహా మిగతా మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 12 మండలాల్లో 12సెం.మీ కన్నా ఎక్కువ వర్షం కురిసింది. భూపాలపల్లి మండలంలో ప్రస్తుతం అతి తక్కువ వర్షపాతం(0.5సెం.మి) నమోదైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి..
చేర్యాల-11.4 సెం.మీ, మద్దూరు 13.5, నర్మెట 11.5 జనగామ 8.4, లింగాలఘణపురం 11.1. రఘునాథ్‌పల్లి 14. స్టేషన్‌ఘన్‌పూర్ 13.6, ధర్మసాగర్ 18.1, హసన్‌పర్తి 10.5, హన్మకొండ 16, వర్ధన్నపేట 9.9, జఫర్‌గఢ్ 9.6, పాలకుర్తి 6.9, దేవరుప్పుల 9, కొండకండ్ల 12, రాయపర్తి 5.3, తొర్రూరు 7.3, నెల్లికుదురు 7.5, నర్సింహులపేట 4. మరిపెడ 3.3, డోర్నకల్ 1.8, కురవి 5, మహబూబాబార్ 5.2, కేసముంద్రం 7.8, నెక్కొండ 13, గూడూరు 10, కొత్తగుడ 12.5, ఖానాపూర్ 12.7, నర్సంపేట 11.4, చెన్నారావుపేట 11.5, పర్వతగిరి 7.2, సంగెం 13.1, నల్లబెల్లి 9, దుగ్గొండి 10, గీసుకొండ 20, ఆత్మకూరు 5.6, శాయంపేట-5.6, పరకాల 2.5, రేగొండ 3.1, మొగుళ్లపల్లి 2.8, చిట్యాల 3.2, భూపాలపల్లి 0.5, గణపురం 1.9, ములుగు 4.3, వెంకటాపురం 3.2, గోవిందరావుపేట 2.8, తాడ్వాయి 4, ఏటూరునాగారం 1.9, మంగపేట 6.2, వరంగల్ 12.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.