విలేకరినంటూ టీచర్‌కు బెదిరింపులు
Published Mon, Mar 13 2017 11:55 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
- విధులకు వెళ్తుండగా మధ్యలో అడ్డుకుని భయపెట్టిన దుండగుడు
వెల్దుర్తి రూరల్: ‘నేను చానెల్ విలేకరిని. నీ మీద గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వాటికి సమాధానం చెప్పు. లేకపోతే నీ అంతు చూస్తా’ అంటూ ఓ వ్యక్తి విధులకు వెళ్తున్న టీచర్‌ను అడ్డుకుని భయభ్రాంతులకు గురిచేశాడు. బాధితురాలు తెలిపిన పూర్తి వివరాలు.. మండల పరిధిలోని బోగోలు ఎంపీపీ స్కూల్ టీచర్ సువర్ణమ్మ రోజువారి విధుల్లో భాగంగా కర్నూలు బస్సులో నుంచి డోన్‌వైపు హైవేపై అమకతాడు టోల్‌గేట్ వద్ద దిగింది. అక్కడ ఉంచిన తన స్కూటీపై స్కూల్‌కు బయలుదేరగా గుంటుపల్లెలో హెచ్‌ఎం ఓ వ్యక్తిని విలేకరి అంటూ పరిచయం చేసింది. అదే వ్యక్తి టీచర్ వెంట ఫాలో అయి మార్గమధ్యలో స్కూటీని ఆపమని కేకేశాడు. విలేకరి కదా అని స్కూటీ ఆపిన టీచర్‌కు బెదిరింపులు మొదలయ్యాయి. బడికి సరిగా రావడంలేదంటూ బోగోలు గ్రామస్తులు వాయిస్ ఇచ్చారని, సమాధానం చెప్పి వెళ్లాలని అడ్డుకున్నాడు.
పాఠశాల వద్దకు వస్తే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతానని అన్నా వినకుండా, ఎవరికీ ఫోన్ చేయనివ్వకుండా స్కూటీకి అడ్డుగా నిలిచి భయపెట్టాడు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా తనది ఆవులదొడ్డి గ్రామం అని, తన పేరు ప్రసాద్ అని, తన తండ్రి పేరు సుంకన్న అని ఎవరికి చెప్పుకున్నా అభ్యంతంరం లేదని ఎన్నో మర్డర్లు చేశానని, పోలీసులు కూడా తనను ఏమీ చేయలేరని భయపెట్టాడు. చివరకు అటువైపు రైతులు రావడంతో ధైర్యం చేసి నీవేమైనా చేసుకోపో అంటూ అక్కడి నుంచి బయటపడి పాఠశాలకు వెళ్లి హెచ్‌ఎం చంద్రుడు నాయక్‌కు జరిగిన విషయం తెలిపింది. ఆయన ఎంఈఓ రామ్మోహన్‌కు విషయం చేరవేయగా పోలీసులకు ఫిర్యాదుచేస్తానని ఎంఈఓ తెలిపారు.
Advertisement