- కాటన్ బ్యారేజ్ నుంచి 1,67,831 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
- ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్):
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
Published Tue, Jul 18 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజ్‌లోని మొత్తం 175 గేట్లను 0.40 మీటర్లు మేర పైకి లేపి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం బ్యారేజ్ వద్ద 7.90 అడుగుల నీటి మట్టం ఉండగా 1,67,831 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశారు. లక్ష క్యూసెక్కులు దాటి మిగులు జలాలను విడుదల చేయడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం. శబరి పరీవాహక ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతుండటంతో బుధవారం కూడా నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం కాటన్ బ్యారేజ్ వద్ద సుమారు రెండు లక్షల క్యూసెక్కులు దాటి నీటి ప్రవాహం సాగే అవకాశం ఉంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది. బలహీనంగా ఉన్న దిగువ ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 900 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.71 మీటర్లు, పేరూరులో 4.73 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.34 మీటర్లు, భద్రాచలంలో 16.90 అడుగులు, కూనవరంలో 7.88 మీటర్లు, కుంటలో 9.50 మీటర్లు, కొయిదాలో 9.42 మీటర్లు, పోలవరంలో 6.72 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 13.90 అడుగుల వద్ద నీటి మట్టాలు నమోదయ్యాయి.
Advertisement
Advertisement