శంషాబాద్ నీళ్ల వ్యాపారుల దోపిడీ మరింత పెరిగింది. గత పదిహేను రోజులుగా రూ.10 కు విక్రయించే 20 లీటర్ల నీటిని అమాంతం రెట్టింపు చేశారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించకుండా ఫిల్టర్ నీటిని అమ్ముకునే వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గత పదేళ్లుగా పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫిల్టర్ వ్యాపారులపై ఇంతరకు అధికారులు తనిఖీలు, అజమాయిషి కాస్తా లేకపోవడంతో వీరిది ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల సిండికేట్‌గా మారి రేట్లు కూడా పెంచేవారు. ఫ్లోర్ ఫ్లోరుకు ఓ లెక్కన రేట్లు తీసుకుంటున్నారు.
నీటి సమస్యతో ..
శంషాబాద్‌లో ప్రస్తుతం పాత గ్రామానికి కృష్ణా నీరు సరఫరా అవుతోంది. రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే, రైల్వే ట్రాక్‌కు కుడివైపున ఉన్న కాలనీలకు కృష్ణా నీరు అందటం లేదు. దీంతో ఇక్కడి వారు ఫిల్టర్ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శంషాబాద్ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో నీటి వ్యాపారులు ఇదే అదనుగా ధరలను పెంచేసి దోపిడి చేస్తున్నారు. మురుగునీటి ప్రవాహనం పక్కనే బోర్లు వేసి కూడా నీటిని అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు.
పంచాయతీ కొరడా..
ఇటీవల గ్రామసభలో సమస్య ప్రస్తావనకు రావడంతో ఎట్టకేలకు శంషాబాద్ పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్టర్ నీటిని సరఫరా చేసే వారు నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్‌లను పొందడంతో పాటు పంచాయతీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా సోమవారం ఫిల్టర్ వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. పెంచిన రేట్లను కూడా వెంటనే తగ్గించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు రంగంలోకి దిగడంతో వ్యాపారులు దిగొస్తారా.. లేదా యధాతథంగా తమ దందాను కొనసాగిస్తారా..? లేదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.