హుజూర్‌నగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంచినీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఇన్నాళ్లు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు మంచి నీరు తాగాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా నీరు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కోసారి ఇంటినుంచి తెచ్చుకున్నా సరిపోని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో విద్యార్థులు కష్టాలు పడుతున్న విషయాన్ని గ్రహించిన విద్యాశాఖ ఉన్నత అధికారులు వారి కష్టాలకు స్వస్తి పలకనున్నారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా మంచినీటి మినీ ట్యాంక్‌లు నిర్మించి విద్యార్థులకు మంచి నీటిని అందించేందుకు నివేదికలను సిద్ధం చేశారు. దీని కోసం పూర్వ నల్లగొండ జిల్లాలో190 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటికి రూ 1.71 కోట్లు నిధులు కేటాయించారు. వాటిలో 50 శాతం నిధులను ఇప్పటికే స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ) బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మిగతా డబ్బులను పూర్తిగా చెల్తించనున్నారు. నల్లగొండ జిల్లాలో 103 పాఠశాలలు, సూర్యాపేట జిల్లాలో 54 పాఠశాలలు, యదాద్రి భువనగిరి జిల్లాలో 33 పాఠశాలలను ఈపథకానికి ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు రూ. 90 వేల చొప్పున నిధులు కూడా మంజూరు చేశారు.
ఈనేపథ్యంలో హుజూర్ నగర్ మండలంలోని 8 పాఠశాల లకు కలిపి మొత్తం రూ 7. 20 లక్షలు మంజూరు అయ్యాయి. మండలంలోని శ్రీనివాసపురం, మాచవరం, లింగగిరి, లింగగిరి ఎస్సీ కాలనీ, మగ్ధుం నగర్, ఆనంద్ నగర్, జంగాల గూడెం, మాధవరాయిని గూడెం పాఠశాలల్లో ఈపథకం పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈనిధులతో ఆయా పాఠశాలల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చోట్లలో బోర్లు వేయడం, మినిట్యాంకులు నిర్మించడం, పైపులు వేయడం, నల్లాల దిమ్మెల నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కాగా ఇప్పటికే మూడు జిల్లాలలో 190 పాఠశాలలో నిర్మాణాలు మొదలు పెట్టారు. వాటిలో ఇప్పటి వరకు 68 పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. 122 పాఠశాలల్లో వీటి నిర్మాణ పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. దాదాపుగా డిసెంబర్ నెలలోనే వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మిగిలినవి కూడా పూర్తయితే మూడు జిల్లాలలోని 190 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విద్యార్థుల మంచినీటి కష్టాలు గట్టెక్కుతాయి. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల కష్టాలు తీరనున్నాయని ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంచినీటి కష్టాలు తీరనున్నాయి
ఇప్పటి వరకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత మంచినీటికి చాలా ఇబ్బందులు పడేవారు. మినీ ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మంచినీటి పథకం నిర్మాణం పూర్త యితే విద్యార్థుల మంచినీటి కష్టాలకు ఫుల్‌స్టాప్ పడుతుంది.
– దేవరం రామిరెడ్డి. హెచ్‌ఎం, శ్రీనివాసపురం
తీరనున్న మంచినీటి కష్టాలు
Published Sun, Dec 18 2016 1:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement