చివరి భూములకూ నీరందిస్తాం
► కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్
► రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని చిన్న, మధ్యతరహా మిషన్ కాకతీయ చెరువుల ద్వారా ఆయా ప్రాజెక్టులు, ట్యాంకుల పరిధిలోని చివరి గ్రామాల రైతులకు కూడా సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల శాఖ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బజార్‌హత్నూర్, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల వద్ద చేపట్టిన పనులను సమీక్షించారు. ఈ ఏడాది పూర్తి చేసిన మిషన్ కాకతీయ చెరువుల ద్వారా గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలు సాగు కానుందో తెలుపాలన్నారు. ఆయా గ్రామాల్లో సాగునీరు విడుదల చేసేముందు రైతులకు టాంటాం ద్వారా తెలుపాలన్నారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు.
రెవెన్యూ అంశాలపై సమీక్ష
అనంతరం రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రధానంగా నీటి పన్నును స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వసూలు చేయాలన్నారు. గ్రామాలవారీగా జమాబందీ, క్రాప్ బుకింగ్, సాదాబైనామా కేసులు పరిష్కరించాలన్నారు. 2015-16 ఏడాదిలో పహణీలు అప్‌లోడింగ్ చేసి 100శాతం ఆధార్ నమోదు చేయాలని, అర్హత గల రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అర్హులకే వర్తింపజేయూలన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్ భూములపై రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సమస్యలు తెలుసుకుని తహసీల్దార్లకు అందించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు.
దళితబస్తీ పథకం అమలులో ఇతర జిల్లాల కంటే ఆదిలాబాద్‌ను ముందంజలో ఉంచడానికి కృషి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకెంతమందికి భూమి పంపిణీ చేయాల్సి ఉందో గ్రామాల వారీగా వివరాలు సేకరించి అందించాలని దళిత అభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. జేసీ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ సుశీల్, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.