సింగపూర్ అమరావతిని తట్టుకోలేం
గుంటూరు: ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించనున్న నూతన రాజధాని సింగపూర్ అమరావతిని మన ప్రజలు తట్టుకోలేరని రాష్ట్ర మాజీ మంత్రి డొక్కామాణిక్య వరప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరులో సాక్షి ఆధ్వర్యంలో జరిగిన ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన స్వచ్చందంగా పాల్గొని మాట్లాడారు. అలా నిర్మిస్తే ఒక్కసారిగా వచ్చి పడిన ప్రశ్చాత్య పోకడలను తట్టుకోలేక రిషితేశ్వరి ఘటన మాదిరిగానే ఇక్కడ జరిగే ప్రమాదం ఉందన్నారు. రిషితేశ్వరి సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మంచి పౌరులుగా తయారు అవ్వాలని కలలు కంటూ యూనివర్సిటీలకు వస్తున్న విద్యార్థినులు అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన చెప్పారు.
ప్రిన్సిపాల్‌తో కొందరు ఉద్యోగులు విసృంఖలత్వానికి ప్రతినిధులుగా మారారని మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనలో బాబూరావుపై చర్యలు తీసుకోవాలని, రిషితేశ్వరి కేసు విచారణ పక్కదోవ పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సందేశం ఇవ్వాలని, అది దీర్ఘకాలిక ప్రణాళికతో ఉండాలని చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఫీజులు కట్టలేక వారు టార్చర్ భరించలేక తీవ్రమనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ కళాశాలలో జరిగిన సంఘటనను విచారించి ఆ కళాశాలపై నిషేధం విధించానని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థలను బ్యాన్‌చేయాలని డొక్కా స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్థాయిలో ప్రభుత్వమే విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని డొక్కా సూచించారు.