
తాత్కాలికంగా 15 వేల ఇళ్లు కావాలి
తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో ఉద్యోగుల కోసం తాత్కాలికంగా 15 వేల ఇళ్లు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడకు ఉన్నపళంగా అన్నీ వదులుకుని రావాలంటే కష్టమే గానీ.. చరిత్రను కూడా మనం గుర్తుంచుకో వాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఇప్పటికే మనం చాలా నష్టపోయామని.. అప్పట్లో ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని.. అయినా విభజన చేయడం, చేసిన తీరు అందరికీ బాధ కలిగించిందని చెప్పారు. అక్కడి నుంచే మనకు కష్టాలు మొదలయ్యాయన్నారు. 2019లో కూడా ఏపీకి లోటుబడ్జెట్టే ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నామని, దానికి సింగపూర్ ప్రభుత్వం కూడా ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెప్పారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో కూడా అందరూ అమరావతి గురించే మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతం నుంచి పరిపాలన సజావుగా సాగితే ప్రజలకు అన్నివిధాలా లాభం వస్తుందని అన్నారు. ఈ బాధ్యత ఉద్యోగుల మీద కూడా ఉందని.. మనమంతా కలిసి పనిచేయాలని చెప్పారు.