వారిది దుర్భర జీవితం
♦ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటాం
♦ ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు
విజయనగరం గంట స్తంభం : కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతారని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం విజయనగరం ఏపీ ఎన్‌జీఓ సంఘం భవనంలో జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ భాగమన్నారు. 2001లో ఈ వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుంచి వారు బానిసలుగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ప్రసూతి సెలవులు కూడా దక్కడం లేదని తెలిపారు.
ఏడాదిలో పదిన్నర నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో 28 వేల మంది కాంట్రాక్ట్, 55 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. వారి పక్షాన ఏపీ ఎన్జీఓల సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అందుకే ఇక్కడ పోరాటానికి కార్యాచరణ కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు కూడా సామాజిక బాధ్యతగా ఈ పోరాటంలో పాల్గొనాల్సిందిగా సూచించారు.
కొంతమందికే పరిమితమైన పెంపు..
ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచినప్పటికీ అది కొంతమందికే పరిమితమైనట్లు తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సమానపనికి సమానవేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం దీనిపై తొందరలోనే చర్చించనుందని, వారి దృష్టికి సమస్య తీసుకెళ్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సి ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిందని, ఇప్పుడు హామీని అమలు చేయాలన్నారు. న్యాయ పరమైన సమస్య ఉంటే ముందుగా వారి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటంలో అంతా కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి.రమణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జరిగే పోరాటంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఏపీ ఎన్జీఓల సంఘం అండగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వి.రమణమూర్తి, విజయనగరం తాలూకా సంఘం అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఇతర సంఘం నాయకులు, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.