
వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా మానవహారం
అనంతపురం ఎడ్యుకేషన్ : 'ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు' నినాదంతో ఆదివారం విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన 'జై ఆంధ్రప్రదేశ్' సభకు సంఘీభావంగా శనివారం వైఎస్సార్ సీపీ ఎస్‌యూ ఆధ్వర్యంలో నగరంలోని టవర్‌క్లాక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి', 'ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాంబాబు, జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ హామీ ఇచ్చాయన్నారు.
తీరా గెలిచి అధికారం చేపట్టాక మూడేళ్లవుతున్నా ప్రత్యేకహోదా గురించే ఆలోచించడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు జంకుతున్నారన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రధాని కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా లభిస్తే ఎన్ని ఉపయోగాలో తెలిసి కూడా చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా సాధించుకునే దాకా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మారుతీప్రకాష్, సుధీర్‌రెడ్డి, సునీల్‌దత్తరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, నాయకులు నవీన్, కిరణ్, అనిల్, షారూఖాన్ పాల్గొన్నారు.