చేనేత కార్మికుడి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు చిందబరరావు వీధిలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు నూకల రామసుబ్బయ్య శనివారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న ఈయనకు నలుగురు సంతానం. మగ్గం ద్వారా సంపాదించిన దాంతోనే ఇద్దరు కూతుళ్లు, కుమారునికి పెళ్లిళ్లు జరిపించాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు పాలవ్యాపారం చేస్తున్నాడు. రెండో కుమారుడు రామకృష్ణ కర్నూలు కరూర్ వైశ్యాబ్యాంకులో గుమస్తాగా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడి దగ్గర ఉంటున్న రామసుబ్బయ్య.. వృద్ధాప్యం పైబడటం, కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆయన ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. ఆదివారం ఉదయం గ్యాంగ్‌మెన్ గుర్తించి స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఎస్‌ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఫోన్ డెయిరీ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారులతో పాటు బంధువులు రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు.