satarday
-
ఏడు కొత్త వంగడాలు విడుదల
యూనివర్సిటీక్యాంపస్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఏడు నూతన వంగడాలను విడుదల చేశారు. వరిలో మూడు, వేరుశనగలో ఒకటి, శనగలో ఒకటి, మినుములో ఒకటి, పొద్దు తిరుగుడులో ఒకటి చొప్పున వంగడాలను రూపొందించి శనివారం విడుదల చేశారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశోధనా సంచాలకులు ఎన్వీ నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎంటీయూ –1140 (భీమ), ఎంటీయూ– 1556(తరంగ్), నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎన్‌డిఎల్‌ఆర్ 7(నంద్యాలసోన) వరి వంగడాలను రూపొందించారు. తిరుపతి నుంచి తొలిసారిగా మినుమపంటలో పరిశోధనలు చేసి టీ బీజీ –104(తిరుపతి మినుము) విడుదల చేశారు. ఈ వంగడాన్ని శాస్త్రవేత్త ప్రశాంతి రూపొందించారు. అలాగే శనగకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌బీఈజీ –49(నంద్యాల గ్రామ్ 49) విడుదల చేశారు. వేరుశనగకు సంబంధించి అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో కె1535(కదిరి అమరావతి ) రకాన్ని రూపొందించారు. అలాగే పొద్దుతిరుగుడుకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌డీఎస్‌హెచ్– 1012 (ప్రభాత్) రకాన్ని రూపొందించి విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. – ఎంటీయూ–1140(భీమ) ఈరకాన్ని పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ–5249, పీఎల్ఏ–8275 రకాలను సంకరపరచి రూపొందించారు. పంటకాలం 140–145 రోజులు. ఈ రకం 130 సెం.మీ ఎత్తుపెరిగి కాండం ధృడంగా వుంటుంది. చేనుపై పడిపోదు. పడిపోయినా తట్టుకునే శక్తి వుంటుంది. దోమపోటును, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. సాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు ఆరు టన్నులు, అసాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు 4 టన్నులు దిగుబడి ఇస్తుంది. – ఎంటీయూ–1156(తరంగ్)ః దీనిని మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ– 1010, ఎంటీయూ–1081 రకాలను సంకరపరిచి రూపొందించారు. ఇది బలమైన గాలులను తట్టుకుంటుంది. పంటకాలం 115–120 రోజులు. వెన్ను పొడవుగా వుండి 200 నుంచి 250 గింజలను గలిగివుంటుంది. హెక్టార్‌కు 7.5 టన్నులు దిగుబడి ఇస్తుంది. దోమపోటు, అగ్గితెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. –టీబీజీ –104( తిరుపతి మినుము ఒకటి): పీయూ– 19,ఎల్బీజీ–623 రకాలను సంకరపరిచి రూపొందించారు. ముధురు ఆకుపచ్చని ఆకులు కలిగివుంటాయి. పంటకాలం 75 –85 రోజులు. దిగుబడి హెక్టారుకు 15 నుంచి 18 క్వింటాళ్లు ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధిపరిచారు. –ఎన్‌బీఈజీ–49(నంద్యాల గ్రామ్49) ః ఇది దేశవాళీ శనగరకం. అన్నెగిరిరకాన్ని, ఐసీసీ– 4958 రకాన్ని సంకర పరచి రూపొందించారు. నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించిన ఈరకం ద్వారా గింజలు మంచి నాణ్యతతో గోధుమరంగు కలిగివుంటాయి. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి సాధిస్తాయి. పంటకాలం 90–105 రోజులు. –కె1535( కదిరి అమరావతి ): కదిరి–6,ఎన్సిఎసి–2242 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేశారు. కాలపరిమితి 115–120 రోజులు. హెక్టార్‌కు 1705 కిలోల దిగుబడి ఇస్తుంది. అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు. బెట్టపరిస్థితులను తట్టుకుంటుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ, రసంపీల్చే పురుగు తెగులను తట్టుకోగలదు. –ఎన్‌డిఎల్‌ఆర్–7(నంద్యాలసోన): ఈ వరిరకాన్ని నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించారు. బీపీటీ –3291, సిఆర్–157 రకాలను సంకరపరిచి రూపొందించారు. పంటకోత దశలో పైరు పడిపోదు. గింజరాలదు. మంచి రుచిగల అన్నం మరుసటిరోజు వరకు నిల్వ సామర్థ్యం కలిగివుంటంది. బీపీటీ –5204 రకంతో పోల్చినప్పుడు 10.8 శాతం అధిక దిగుబడి సాధిస్తుంది. పంటకాలం 140 రోజులు. – ఎన్‌డీఎస్‌హెచ్–1012 (ప్రభాత్)ః ఎన్డీసీఎంఎస్–30ఎ,ఆర్ –843 రకాలను సంకరపరిచి రూపొందించిన పొద్దుతిరుగుడ రకం. తక్కువ కాలపరిమితితో అధిక నూనె శాతం గల సంకరరకం. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్లు వర్షాధారం కింద, 8 నుంచి 10 క్వింటాళ్లు నీటి పారుదల పరిస్తితుల్లో ఇస్తుంది. నూనె దిగుబడి హెక్టార్‌కు 705 క్వింటాళ్లు లభిస్తుంది. నంద్యాల పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు. -
తిరుచ్చిపై శ్రీనివాసుడు చిద్విలాసం
శ్రీనివాస మంగాపురం(చంద్రగిరి): శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించారు. వారపు ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణమండంపంలోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈసందర్భంగా భక్తులు దేవేరులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనుంజయ, ఇన్స్పెక్టర్లు దినకర రాజు, కష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి నీటిబొట్టూ సద్వినియోగం చేసుకుందాం
– సీఎం పర్యటన ప్రాంతాల్లో కలెక్టర్ తనిఖీ – జిల్లాకు త్వరలో వ్యసాయాధారిత పరిశ్రమలు – నీటిని నిల్వకు రూ.500 కోట్లు వెచిస్తున్నట్టు వెల్లడి వి.కోట: ప్రతి వర్షపు చినుకునూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పిలుపునిచ్చారు. వీకోట మండలంలో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించనున్న పాముగానిపల్లె, బైరుపల్లె పంచాయతీలోని వ్యవసాయ క్షేత్రాలను, పంట సంజీవని గుంతలను శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలాల పెంపుతో పాటు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేసేందుకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇందుకోసం హంద్రీనీవా కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గ్రామజలదర్శిని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జల వనరుల వినియోగాన్ని సమీక్షిస్తామన్నారు. రెయిన్ గన్లు, స్ప్రింక్లర్ల ద్వారా ఎండిపోతున్న వేరుశనగ పంటను పూర్తిస్థాయిలో కాపాడుతామన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ఆధునిక పద్ధతులను అవలంభించి లాభాల బాట పట్టాలని సూచించారు. పలవునేరు, కుప్పం, మదనపల్లె ప్రాంతాలు హార్టికల్చర్ హబ్‌గా తయారయ్యాయన్నారు. త్వరలోనే వ్యవసాయాధారిత పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయన్నారు. రైతులు, జన్మభూమి కమిటీలు, నీటి సంఘాలు, అధికారులను ఏకం చేసి నీటి నిల్వలు, సమర్థ వినియోగానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 10 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాజుపేట రోడ్డు వద్ద మ్యాంగో మార్కెట్‌కు ప్రతిపాదనలు పంపావున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృతికా భాత్ర, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో పెంచలకిషోర్, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అవురనాథ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయుడు, ఎంపీపీ సులోచన తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో పవన్ కల్యాణ్
సాక్షి, తిరుమల: సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలకు వచ్చిన ఆయన సుఫథం ప్రవేశ మార్గం నుండి శ్రీవారి దర్శించుకున్నారు. తర్వాత శనివారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన స్వామివారిని మరోసారి దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తోపులాటలు నివారించారు. ఆలయం వెలుపల పవన్‌కల్యాణ్‌ను చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తర్వాత అతిథిగృహానికి చేరుకున్న ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతికి పయనమయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతోపులాటల కారణంగా ఆయన తూలి కింద పడిపోతుండటంతో, భద్రతా సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: వారాంతపు సెలవులతో తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,624 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 30 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 12 గంటలు, 16 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. కేంద్రీయ విచారణ కార్యాలయం, పద్మావతి, ఎంబీసీ–34 రిసెప్షన్ కేంద్రాల్లో గదుల కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు కాచారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. -
తిరుమలలో భద్రత కట్టుదిట్టం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరుమలలో టూ టౌన్ సీఐ వెంకటరవి నేతత్వంలో శనివారం తులసీరామ్, బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చిన ప్రతి భక్తుడి విచారించడంతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు. ఆలయంతోపాటు అన్నప్రసాద కేంద్రం, కల్యాణకట్ట, రద్దీ ఉండే ముఖ్య కూడళ్లలలోనూ నిఘాను పెంచారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాహన రికార్డులు తనిఖీ చేశారు. -
పవిత్రోత్సవాలకు శాస్రోక్తంగా అంకురార్పణ
సాక్షి,తిరుమల: తిరుమల ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం నిర్వహించే పవిత్రోత్సవాలకు శనివారం శాస్రోక్తంగా అంకురార్పణతో ఆరంభించారు. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని శాసనాధారాలు ఉన్నాయి. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహిం^è నున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేశారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణం, ఆస్థానంతో కార్యక్రమాన్ని వైదికంగా పూర్తి చేశారు. ఇక తొలిరోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేసి పట్టు పవిత్రాలను ( పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు సోమవారం పట్టు పవిత్రాలు సమర్పించనున్నారు. చివరి రోజు మంగళవారం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ ఉత్సవం కారణంగా ఆదివారంæనుంచి ఈనెల 16వ తేదీ వరకు ఆయా రోజుల్లో నిర్వహించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు అపవిత్రమయ్యాయి తెలిసో, తెలియక జరిగిన దోషాల నివారణ కోసం చేసే పవిత్రోత్సవాలు దోçషం ఉన్న అర్చకుడితో నిర్వహించటం మరింత దోషం అవుతుంది. అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని నిర్వహించే సీతారామాచార్యులు అత్తకు కర్మకాండలు నిర్వహించి రెండు నెలలు కూడా గడవక ముందే ఆయనతో పవిత్రోత్సవాలు నిర్వహించటం శాస్త్ర విరుద్ధం. దీనిపై ఆలయ అధికారులకు ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పవిత్రోత్సవాలు మరింత అపవిత్రం అవుతాయి. జరగబోయే అరిష్టాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. –మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విమర్శ -
తిరుమలలో పోటెత్తిన భక్తులు
సాక్షి,తిరుమల: తిరుమల కేత్రం శనివారం భక్తులతో నిండింది. వరుస సెలవులతో భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్తులతో నిండిన క్యూలు విస్తరించాయి. ప్రయాణం,గదులు, తలనీలాలు, శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు క్యూలైన్లలో నిరీక్షించారు. శనివారం కావటంతో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు భక్తులు వేలాదిగా నడిచివచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు 55,129 మంది శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 31 కంపార్ట్మెంట్లలో నిండి, వెలుపల కిలోమీటరు వరకు సర్వదర్శనం భక్తులు క్యూ కట్టారు. వీరికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 10 గంటల సమయం తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ ఒక్క గది కూడా ఖాళీ లేదు. -
కాణిపాకం ఆలయంలో లఘు దర్శనం
కాణిపాకం (ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం లఘు దర్శనం నిర్వహించారు. శని, ఆది, సోమ వారాలు వరుసగా ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో దూరప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు లఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం అభిషేకాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అభిషేక సేవలోనూ లఘు దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలోని పది, యాభై, వంద రూపాయల టికెట్ల క్యూలన్నీ భక్తులతో నిండాయి. రెండు నుంచి మూడు గంటల సమయం పాటు స్వామివారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. క్యూలోని భక్తుల దాహం తీర్చడం కోసం ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. క్యూలను ఆలయ ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఆలయ ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పర్యవేక్షించారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,937 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 12 గంటలు, 14 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. కేంద్రీయ విచారణ కార్యాలయం, పద్మావతి, ఎంబీసీ–34 రిసెప్షన్ కేంద్రాల్లో గదుల కోసం భక్తులు నిరీక్షించారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.76 కోట్లు లభించాయి. -
రేపు ఎస్వీయూలో ఉద్యోగ మేళా
తిరుపతి అర్బన్: హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్ కంపెనీ ప్రతినిధులు ఎస్వీయూలో శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ మేడసాని దేవరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. 2015, 2016 విద్యా సంవత్సరాల్లో వైరాలజీ, మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మేటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ మేళా శనివారం ఉదయం 9:30 నుంచి ప్లేస్మెంట్ ఆఫీస్‌లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఓరల్ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు చిందబరరావు వీధిలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు నూకల రామసుబ్బయ్య శనివారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న ఈయనకు నలుగురు సంతానం. మగ్గం ద్వారా సంపాదించిన దాంతోనే ఇద్దరు కూతుళ్లు, కుమారునికి పెళ్లిళ్లు జరిపించాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు పాలవ్యాపారం చేస్తున్నాడు. రెండో కుమారుడు రామకృష్ణ కర్నూలు కరూర్ వైశ్యాబ్యాంకులో గుమస్తాగా పని చేస్తున్నాడు. పెద్ద కుమారుడి దగ్గర ఉంటున్న రామసుబ్బయ్య.. వృద్ధాప్యం పైబడటం, కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఆయన ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో శవమై కనిపించాడు. ఆదివారం ఉదయం గ్యాంగ్‌మెన్ గుర్తించి స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాల మేరకు రైల్వే ఎస్ఐ జగన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఫోన్ డెయిరీ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారులతో పాటు బంధువులు రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ తెలిపారు.