ఏడు కొత్త వంగడాలు విడుదల | seven new seeds release | Sakshi
Sakshi News home page

ఏడు కొత్త వంగడాలు విడుదల

Published Sat, Oct 1 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

ఎన్‌బీఈజీ –49 (నంద్యాలగ్రామ్‌శనగపంట)

ఎన్‌బీఈజీ –49 (నంద్యాలగ్రామ్‌శనగపంట)

యూనివర్సిటీక్యాంపస్‌:
 ఆచార్య  ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఏడు నూతన వంగడాలను విడుదల చేశారు. వరిలో మూడు, వేరుశనగలో ఒకటి, శనగలో ఒకటి, మినుములో ఒకటి, పొద్దు తిరుగుడులో ఒకటి చొప్పున వంగడాలను రూపొందించి శనివారం విడుదల చేశారు. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశోధనా సంచాలకులు ఎన్‌వీ నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎంటీయూ –1140 (భీమ), ఎంటీయూ– 1556(తరంగ్‌), నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఎన్‌డిఎల్‌ఆర్‌ 7(నంద్యాలసోన) వరి వంగడాలను రూపొందించారు. తిరుపతి నుంచి తొలిసారిగా మినుమపంటలో పరిశోధనలు చేసి టీ బీజీ –104(తిరుపతి మినుము) విడుదల చేశారు. ఈ వంగడాన్ని శాస్త్రవేత్త ప్రశాంతి రూపొందించారు. అలాగే శనగకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌బీఈజీ –49(నంద్యాల గ్రామ్‌ 49) విడుదల చేశారు. వేరుశనగకు సంబంధించి అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో కె1535(కదిరి అమరావతి ) రకాన్ని రూపొందించారు. అలాగే పొద్దుతిరుగుడుకు సంబంధించి నంద్యాల పరిశోధనా స్థానంలో ఎన్‌డీఎస్‌హెచ్‌– 1012 (ప్రభాత్‌) రకాన్ని రూపొందించి విడుదల చేశారు. వీటికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. 
– ఎంటీయూ–1140(భీమ) ఈరకాన్ని పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ–5249, పీఎల్‌ఏ–8275 రకాలను సంకరపరచి రూపొందించారు. పంటకాలం 140–145 రోజులు. ఈ రకం 130 సెం.మీ ఎత్తుపెరిగి కాండం ధృడంగా వుంటుంది. చేనుపై పడిపోదు. పడిపోయినా తట్టుకునే శక్తి వుంటుంది. దోమపోటును, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. సాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు ఆరు టన్నులు, అసాధారణ పరిస్థితుల్లో హెక్టార్‌కు 4 టన్నులు దిగుబడి ఇస్తుంది. 
– ఎంటీయూ–1156(తరంగ్‌)ః
         దీనిని మారుటేరు పరిశోధనా స్థానంలో రూపొందించారు. ఎంటీయూ– 1010, ఎంటీయూ–1081 రకాలను సంకరపరిచి రూపొందించారు. ఇది బలమైన గాలులను తట్టుకుంటుంది. పంటకాలం 115–120 రోజులు. వెన్ను పొడవుగా వుండి 200 నుంచి 250 గింజలను గలిగివుంటుంది. హెక్టార్‌కు 7.5 టన్నులు దిగుబడి ఇస్తుంది. దోమపోటు, అగ్గితెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. 
–టీబీజీ –104( తిరుపతి మినుము ఒకటి):
         పీయూ– 19,ఎల్‌బీజీ–623 రకాలను సంకరపరిచి రూపొందించారు. ముధురు ఆకుపచ్చని ఆకులు కలిగివుంటాయి. పంటకాలం 75 –85 రోజులు. దిగుబడి హెక్టారుకు 15 నుంచి 18 క్వింటాళ్లు ఇస్తుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధిపరిచారు.
–ఎన్‌బీఈజీ–49(నంద్యాల గ్రామ్‌49) ః
 ఇది దేశవాళీ శనగరకం. అన్నెగిరిరకాన్ని, ఐసీసీ– 4958 రకాన్ని సంకర పరచి రూపొందించారు. నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించిన ఈరకం ద్వారా గింజలు మంచి నాణ్యతతో గోధుమరంగు కలిగివుంటాయి. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్లు దిగుబడి సాధిస్తాయి. పంటకాలం 90–105 రోజులు. 
–కె1535( కదిరి అమరావతి ):
       కదిరి–6,ఎన్‌సిఎసి–2242 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేశారు. కాలపరిమితి 115–120 రోజులు. హెక్టార్‌కు 1705 కిలోల దిగుబడి ఇస్తుంది. అనంతపురం జిల్లా కదిరి పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు. బెట్టపరిస్థితులను తట్టుకుంటుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ, రసంపీల్చే పురుగు  తెగులను తట్టుకోగలదు.
–ఎన్‌డిఎల్‌ఆర్‌–7(నంద్యాలసోన):
  ఈ వరిరకాన్ని నంద్యాల పరిశోధనా స్థానంలో రూపొందించారు. బీపీటీ –3291, సిఆర్‌–157 రకాలను సంకరపరిచి రూపొందించారు. పంటకోత దశలో పైరు పడిపోదు. గింజరాలదు. మంచి రుచిగల అన్నం మరుసటిరోజు వరకు నిల్వ సామర్థ్యం కలిగివుంటంది. బీపీటీ –5204 రకంతో పోల్చినప్పుడు 10.8 శాతం అధిక దిగుబడి సాధిస్తుంది. పంటకాలం 140 రోజులు. 
– ఎన్‌డీఎస్‌హెచ్‌–1012 (ప్రభాత్‌)ః
    ఎన్‌డీసీఎంఎస్‌–30ఎ,ఆర్‌ –843 రకాలను సంకరపరిచి రూపొందించిన పొద్దుతిరుగుడ రకం. తక్కువ కాలపరిమితితో అధిక నూనె శాతం గల సంకరరకం. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాళ్లు వర్షాధారం కింద, 8 నుంచి 10 క్వింటాళ్లు నీటి పారుదల పరిస్తితుల్లో ఇస్తుంది. నూనె దిగుబడి హెక్టార్‌కు 705 క్వింటాళ్లు లభిస్తుంది. నంద్యాల పరిశోధనా స్థానంలో దీనిని రూపొందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement