చనిపోయిన చేనేత కార్మికుడు
చేనేత కార్మికుడి ఆత్మహత్య
Published Sat, Sep 17 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
– ఉసురు తీసిన అప్పులు, కుటుంబ సమస్యలు
మదనపల్లెటౌన్: చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా రొద్దం మండలం సానిపల్లెకు చెందిన ఆరేళ్లప్పగారి గోవిందప్ప కొడుకు వెంకటాద్రి(30) చేనేత కార్మికుడు. ఐదేళ్ల క్రితం లక్ష్మిదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేశారు. దీంతో ఏడాది క్రితం స్వగ్రామంలో భార్య, పిల్లలు గోవర్ధన, అంకితను వదిలి మదనపల్లెకు వచ్చాడు. మారుతీనగర్‌లో నివాసం ఉంటూ కూలి మగ్గం నేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన కేఆర్ రూప అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో కాని వారం రోజుల క్రితం రెండో భార్య రూప భర్త వెంకటాద్రికి చెప్పకుండా పుట్టినింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను తాను ఉంటున్న అద్దె ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం గమనించిన ఇంటి యజమాని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఖాదర్‌బాషా అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై స్థానికులను ఆరా తీశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement